విజయమ్మ మారుతారనుకోలేదు: బొత్స, సిఎంకు సపోర్ట్

జగన్ అవినీతి, దోపిడీ కోసమే పద్దెనిమిది మంది తమ పదవులకు రాజీనామా చేశారని వైయస్ విజయమ్మ చెప్పకనే చెప్పారన్నారు. వారు రాజకీయ లబ్ధి కోసమే చూస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్నారు. వైయస్‌ది హత్య, కుట్రగా చిత్రీకరించి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విజయమ్మ కూడా అలాగే మాట్లాడటం దురదృష్టకరం, అనైతికం అన్నారు.
వైయస్ చనిపోయాక సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌లో ఏమొచ్చిందో గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పుడు దానిని కుట్ర అనడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలా దిగజారవద్దన్నారు. అధికారంలో ఉండగా వైయస్ ఒక్కరే చనిపోయారా అని ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ ముఖ్యమంత్రి, మాజీ స్పీకర్ బాలయోగి, కేంద్రమంత్రి మాధవరావు సింధియా, ఇటీవల ఓ పారిశ్రామికవేత్త అయిన ఎంపీని కోల్పోయామని గుర్తు చేశారు. ఇవన్నీ కుట్రలేనా అని ఆయన ప్రశ్నించారు.
విజయమ్మను తాను ఎన్నోసార్లు చూశానని, కానీ ఇలా మారతారని మాత్రం భావించలేదన్నారు. తనయుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విజయమ్మ ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. తన వ్యాఖ్యలతో సానుభూతి వస్తుందని ఆమె భావిస్తున్నారని, కానీ వాస్తవాలు గ్రహించాక అది ఉండదన్నారు. చావును కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల మాటలు వైయస్ ఆత్మ ఘోషించేలా ఉన్నాయన్నారు.
వాస్తవాలతో రాజకీయంగా పోరాడాలని విజయమ్మకు సూచించారు. యునజన శ్రామిక రైతు విధానాలు ఏమిటో చెప్పాలన్నారు. విజయమ్మ మాటలతో సానుభూతి రాదన్నారు. సంక్షేమ పథకాల అమలే కాంగ్రెసు పార్టీ ధ్యేయమన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుతంత్రాలు ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పారిశ్రామికవేత్తగా అతి తొందరగా ఎలా ఎదిగారో రాజకీయ నాయకుడిగా అంతే తొందరగా ఎదగాలని జగన్ భావిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కొక్కరు పది ఓట్లు వేయాలని చెప్పలేదన్నారు. ఒక్కొక్కరు పదిమందితో ఓటు వేయించాలని మాత్రమే సూచించారని కిరణ్‌కు మద్దతుగా మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు తాను పక్కనే ఉన్నానని చెప్పారు. ముస్లింల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని బొత్స, షబ్బీర్ అలీ చెప్పారు.












Click it and Unblock the Notifications