జెండా, అజెండా ఏంటి: జగన్‌పై కిరణ్, వైయస్‌పై చిరంజీవి

పరిటాల కేసులో చార్జిషీట్ నుంచి జగన్ పేరు తీసేశారని... అప్పుడేమో సిబిఐ మంచిది, ఇప్పుడు కాదా? అని మండిపడ్డారు. తాను ఇప్పుడు హెలికాప్టర్‌లో వచ్చానని, కానీ తానే హెలికాప్టర్ నడిపితే ఇంకేమైనా ఉందా అని, దేనికైనా అనుభవం కావాలని, జగన్ మాత్రం ఏ అనుభవం లేకున్నా తనకు ముఖ్యమంత్రి పీటం కావాలంటాడని ఎద్దేవా చేశారు. వైయస్ 26 ఏళ్ల పాటు కష్టపడితేనే సిఎం అయ్యారని, తనకు 21 ఏళ్ల తర్వాతే ఈ అవకాశం లభించిందని తెలిపారు.
జగన్ ఏ త్యాగం చేసి జైలుకెళ్లారని కిరణ్ ప్రశ్నించారు. ఆయనేమైనా రైతుల కోసం పోరాటం చేశారా? ఎస్సీలకు పనులు జరగడంలేదనో, ఎస్టీలకు నిధులు అందడం లేదనో, యువకులకు ఉద్యోగాలు రావడంలేదనో ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లారా అన్నారు. కంపెనీల్లోకి కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలంటూ కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడంతో జైలుకు వెళ్లారన్నారు. కేవలం అహంకారంతో ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై అసెంబ్లీలో అవిశ్వాసానికి జగన్ తెగించారని దుయ్యబట్టారు.
వాళ్ల పార్టీ జెండాలో ఏ గుర్తులు ఉన్నాయో వాళ్లకే తెలియదన్నారు. తమ పార్టీలో ఉన్న గుర్తులేమిటి? అప్పటికీ ఇప్పటికీ వాటిలో ఉన్న తేడా ఏమిటో దమ్ముంటే చెప్పాలని సవాల్ విసిరారు. ఆ పార్టీ ఎన్నాళ్లో నిలబడదంటూ జోస్యం చెప్పారు. మాయమాటలతో ప్రజలను వంచించడానికి జగన్, ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో అంతా అరాచకమే రాజ్యమేలుతుందన్నారు. మేలి ముసుగుతో మీ ముందుకు కన్నీళ్లు కారుస్తూ వస్తున్న వారి వ్యవహార శైలిని గమనించారని ఓటర్లను కోరారు.
పార్టీ పేరు కూడా చెప్పుకోలేనివారు ఇప్పుడు ఆర్థిక నేరాలతో జైలుకు వెళ్లిన జగన్‌కు కాపలాగా వెళ్లేందుకు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి స్వార్థం కోసమే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని బొత్స పేర్కొన్నారు. వైయస్ జేబులో డబ్బు తీసి ఇంతకాలం పథకాలు అమలు చేయలేదని, అది అప్పటి ప్రభుత్వ సమష్టి నిర్ణయమని, ఇదంతా కాదని వైయస్సే అంతా చేసినట్లు చెబుతున్నారని చిరంజీవి విరుచుకుపడ్డారు.
ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. కానీ... ఒక ఆశయం, సిద్ధాంతం ఉండాలన్నారు. మీ అజెండా ఏమిటని నిలదీశారు. సిఎం కావాలని కోరుకుంటున్నప్పటికీ... జనం కోరుకోవడం లేదని జగన్‌పై వాగ్బాణాలు సంధించారు. జగన్ ఏమైనా ధర్మరాజా? ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాడా? ఇలాగైతే శభాష్ అనవచ్చునని, కానీ ఆయన అవినీతి సామ్రాజ్యానికి చక్రవర్తి అని విమర్శించారు. విద్రోహశక్తులు, అరాచక శక్తులతో జగన్ చేతులు కలిపారని, ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన తల్లి విజయమ్మ మాత్రం తన బిడ్డకు అన్యాయం జరిగిపోతోందంటూ ఆరోపిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications