పార్టీ ఆఫీస్ ప్రారంభించిన విజయమ్మ, కలసిన కల్పన

పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ ఇంట్లో అల్పాహార విందు తీసుకున్నారు. జిల్లా నేతలతో కాసేపు ముచ్చటించారు. టిడిపి నేత ఉప్పులేటి కల్పన కూడా ఆమెను కలిశారు. నగరంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విజయమ్మ ధర్నా వేదిక వద్దకు చేరుకొని ఆందోళనలో పాల్గొన్నారు. గతంలో కరెంట్ సమస్యలపై దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఇదే ప్రాంతంలో ధర్నా చేయడం గమనార్హం. అంతకుముందు పార్టీ నేత కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్‌తోనే రాష్ట్రంలో రాజన్న పాలన వస్తుందన్నారు. త్వరలో సుపరిపాలన చూస్తామని చెప్పారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని ఆరోపించారు. మన ప్రాజెక్టులు పక్క రాష్ట్రాలకు తరలి పోతున్నప్పటికీ వారు ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో కేవలం కరెంట్ సమస్యే కాదని ఎన్నో సమస్యలు ఉన్నాయని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. విజయమ్మ ధర్నాకు భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విద్యుత్ సంక్షోభాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టింది. కాగా సోమవారం పులివెందులలో ధర్నా చేసిన విజయమ్మ 23న సిరిసిల్లలో చేనేత కార్మికుల కోసం ఒక్కరోజు దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications