దుమ్ము దులిపే నిర్ణయం: తెలంగాణపై ఎంపి పాల్వాయి

ఈ సందర్భంగా వారంతా.. జై ఆంధ్ర ఉద్యమంలో అసువులు బాసిన 400 మంది ఉద్యమకారులకు, కాకాని వెంకటరత్నానికి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పాల్వాయి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో తెలంగాణ వనరులన్నీ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లిపోయాయని, తర్వాత తెలంగాణను పాలకులు పట్టించుకోలేదని, కాబట్టే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష బలపడిందని చెప్పారు. నిజానికి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడితే పంజాబ్‌లాగా బాగా అభివృద్ధి చెందుతుందని, అందుకు అవసరమైన అన్ని వనరులు అక్కడ ఉన్నాయని అన్నారు.
ధాన్యం ఉత్పత్తి, హోటళ్లు, పరిశ్రమలు మరింత పెరుగుతాయన్నారు. ప్రపంచబ్యాంకు రుణాలు పొందిన తెలంగాణ ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాలేదని, ఇంజనీర్లు, అధికారులు, పాలకుల తప్పుడు నిర్ణయాల వల్లే ఇలా జరిగిందన్నారు. ఆంధ్ర, తెలంగాణల్లో భూముల్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరిపై 13 ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే 3 వేల మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుందన్నారు. కలిసి ఉంటే వైషమ్యాలు పెరుగుతాయని రాపోలు ఆనందభాస్కర్ హెచ్చరించారు.
విడిపోవాలన్నదే ఇరు ప్రాంతాల ప్రజల ఆకాంక్ష అని, దీన్ని గుర్తించకుండా వ్యక్తిగత పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తే ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరుగుతాయన్నారు. కాగా.. ప్రత్యేకాంధ్ర రాజధాని ఏర్పడే వరకూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని వసంత నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తొలుత ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరారు. ప్రత్యేకాంధ్ర కోసం తాము 1972 నుంచే పోరాడుతున్నామని గుర్తుచేశారు.