రాహుల్ గాంధీని కలిశాక మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలంగాణ రాజకీయాల్లో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరగబోతుంది అన్న వార్త రాజకీయవర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మాట్లాడుతూ ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవికి అర్హులేనని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి, అయితే మంత్రివర్గంలో స్థానాలు చాలా పరిమితంగా ఉన్నాయని గుర్తు చేశారు.
మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి
రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో మంత్రుల సంఖ్య 17 మాత్రమే ఉండాలని, దీనిని దాటి విస్తరించడం సాధ్యం కాదని వివరించారు. కేవలం రెండు ఖాళీలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎంపిక ప్రక్రియలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీలో సీనియారిటీ, నిబద్ధత వంటి అనేక కారకాలు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

ఎవరైనా హైకమాండ్ ను కలవొచ్చు అన్న రేవంత్
రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో జరిగిన భేటీ గురించి కూడా ప్రస్తావించారు. మంత్రివర్గ విస్తరణ అంశంపై రాహుల్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు ఎవరైనా హైకమాండ్‌ను కలవడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విస్తరించకపోవడం పార్టీలో ఆసక్తికర చర్చలకు దారితీసింది.
క్యాబినెట్ బెర్త్ కోసం ఢిల్లీలో లాబీయింగ్
ప్రస్తుతం కేబినెట్‌లో రెండు ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలని అనేక మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది ప్రస్తుత మంత్రులను తప్పించి కొత్త వారిని చేర్చాలనే చర్చ జరుగుతున్నట్టు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుత మంత్రుల్లో అసంతృప్తి, ఆశావహులైన ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది.
రేవంత్ రాహుల్ గాంధీని కలవటంతో క్యాబినెట్ విస్తరణపై కొత్త ఊహాగానాలు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో సమావేశమై రాష్ట్ర పరిస్థితులను వివరించారు. ఈ పర్యటన కేబినెట్ విస్తరణకు సంబంధించి కొత్త ఊహాగానాలకు కారణం అయ్యింది.













Click it and Unblock the Notifications