తృణమూల్ ను ఊపిరిసలపనివ్వని సువేందు
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతకాల ఫోర్జరీ ఆరోపణల కేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఆయనకు సీఐడీ తాజాగా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అదే సమయంలో ఆయన నివాసంపై కోల్‌కతా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కేంద్ర బలగాలు సైతం ఇందులో పాలుపంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో కోల్ కత కాళీఘాట్ లోని నివాసంలో ఈ సోదాలు ఆరంభం అయ్యాయి. ఉదయం వరకూ కొనసాగాయి. కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ ఆపరేషన్ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్‌కు సంబంధించిన ఓ కేసు ఆధారంగా ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు గంటల పాటు సాగిన ఈ శోధన ముగిసిన అనంతరం అభిషేక్ విలేకరులతో మాట్లాడారు. తాళం పగలగొట్టి, ఇంట్లోకి ప్రవేశించి ప్రతి గదిలోనూ సోదాలు చేశారని ఆరోపించారు. ఈ పోలీస్ ఆపరేషన్ విషయం తెలియగానే మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆయన నివాసానికి చేరుకున్నారు.
రాజకీయ కక్షసాధింపు చర్యలకు అడ్డు అదుపు ఉండట్లేదని, నానాటికీ దిగజారుతున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ సంతకాల ఫోర్జరీ కేసులో అభిషేక్ బెనర్జీని ఇటీవలే సీఐడీ అధికారులు దాదాపు ఆరు గంటల పాటు అభిషేక్ ను సంగతి తెలిసిందే. ఈ విచారణ ముగిసిన రెండు రోజుల వ్యవధిలోనే ఆయన నివాసంపై జరిగిన ఈ తాజా దాడి తృణమూల్ నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దర్యాప్తు సంస్థలు మరోసారి ఆయనకు సమన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మదన్ మిత్ర కూడా టార్గెట్ అయ్యారు. ఆయనకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు నిర్వహించింది. మున్సిపల్ నియామకాల కుంభకోణంలో భాగంగా దక్షినేశ్వర్‌లోని ఆయన నివాసంలో ఈ తనిఖీలు చేపట్టారు. సుమారు 125 కంటే ఎక్కువ అక్రమ నియామకాలతో మిత్రాకు సంబంధాలు ఉన్నాయని, దళారుల ద్వారా ఆయన పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఈడీ అధికారులు ప్రాథమికంగా ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications