అరవింద రావు ఉపనిషత్తుల పఠనం: సిమీ ప్రేరణ

సిమీ కార్యకర్తల మాటలు తనను సంస్కృతం నేర్చుకుని, ఉపనిషత్తులను పఠించే దిశగా మళ్లించినట్లు ఆయన తెలిపారు. నక్సలైట్ల అణచివేత చర్యలకు సంబంధించి ఆయన తీవ్రమైన విమర్శలకు కూడా గురయ్యారు. రాక్షసుడిగా ఆయనను అభివర్ణించినవారున్నారు. తాను పూర్తిగా ఆధ్యాత్మికంలోకి మళ్లలేదని, తన ఉద్యోగంలో భాగంగా చేశానని ఆయన చెప్పారు. అలా అని ఉండవచ్చు గానీ విధి నిర్వహణలో భాగంగానే తాను చేశానని, వాళ్ల అభిప్రాయం వాళ్లదని ఆయన అన్నారు.
తాను ఆధ్యాత్మికత వైపు, సంస్కృతం నేర్చుకునే వైపు మళ్లించడానికి కారణమైన సంఘటన గురించి ఆయన చెప్పిన వివరాల ప్రకారం - ఆయన 1994లో సిటీ పోలీసు విభాగంలో ఉన్ప్పుడు సిమీవాళ్లను కొందరిని అరెస్టు చేశారు. వాళ్లు తమ మతం గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. వారికి ఆయన సమాధానం చెప్పలేకపోయారట. దాంతో జ్ఞానం సంపాదించాలని చదవడం ప్రారంభించారు. పుల్లెల రామచంద్రుడు, తత్వ వేదానందల వద్ద భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చదివారు. ఉద్యోగంలో ఉండగానే ఎంఎ, పిహెచ్‌డి పూర్తి చేశారు.
తన ఆధ్యాత్మిక అన్వేషణ గురించి అరవింద రావు ఇలా చెప్పారు - నేను ఉపనిషత్తులపై శంకరాచార్యులు, ఆయన శిష్యులు రాసిన వ్యాఖ్యానాలను తీసుకున్నాను. 'ఉపనిషత్తుల్లో జ్ఞాన స్వ రూప వివేచనం' అనే పరిశోధనగ్రంథం సంస్కృతంలో రాశాను. మన సంస్కృతి మొత్తం సంస్కృతంలోనే ఉంది. బౌద్ధులూ సంస్కృతంలో రాశారు. ఇప్పుడు ఇంగ్లీషు ఎలాగో, అప్పుడు సంస్కృతం అలాగన్నమాట. మన ప్రాచీన సైన్స్‌ని ఎవరూ పట్టించుకోవట్లేదు. దాంట్లో ఏముందో తెలుసుకోవాలి కదా.
హిందూమతం దాదాపు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పురోహితుడిపైన బ్రహ్మ తప్ప మరెవరూ లేరని, ఇతర మతాల్లో అలా కాదని, గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ ప్రధాన కేంద్రం వరకు అన్నీ ఉంటాయని, నిధులూ అందుతాయనిస, హిందువులను కలిపి ఒక చోట కూర్చోబెడదామంటే కలవరని, స్వాముల్లో సామాజిక చైతన్యం తక్కువగా కనిపిస్తోందని ఆయన వివరించారు.
రామకృష్ణమిషన్, చిన్మయ మిషన్ లాంటివాళ్లు పేదల వద్దకు కూడా వెళ్తున్నారని, కానీ వాళ్లు మేజిక్కులు చేయరు కాబట్టి జనం వారి దగ్గరికి అంతగా వెళ్లరని ఆయన అసలు రహస్యం చెప్పారు. మన సిద్ధాంతంలో చాలా బలం ఉందని, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేనిమాట వాస్తవమని ఆయన అన్నారు. అమలును మనం సరిచేసుకోవాలని, ఉపనిషత్తుల్లో కూడా చాలా స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. శంకరాచార్యులు, రామానుజుడు, మధ్వాచార్యుడు గురించి ఆయన వివరించారు.
1996 నవంబర్‌లో ఆనయ నక్సలైట్ టెర్రరిజం అనే పుస్తకం రాశారు. పదవీ విరమణ చేసిన తర్వాత పోలీసు అధికారులు ఓ కార్పొరేట్ కంపెనీల్లో చేరుతూ ఉంటారు. అరవింద రావు మాత్రం ఆ పని చేయదలుచుకోలేదు. ఆయన పుస్తకాలు చదువుతూ సత్కాలక్షేపం చేస్తున్నారు. తాను మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఎదిగానని ఆయన తన జీవితం గురించి చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications