కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక మేమే: రాజకీయ నేతలకు కోదండరామ్ హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
కరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, కలిసిరాని ప్రజాప్రతినిధులకు తెలంగాణ మార్చ్ ఓ మృత్యుగీతిక అని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు. కరీంనగర్‌లో ఆదివారం ఆయన కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగాను, మార్గమధ్యంలో మెదక్‌జిల్లా కొండపాకలోను ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. నాయకులకు ఓట్లేశాం కాబట్టి.. డెడ్‌లైన్లు పెట్టే అధికారం తమకే ఉందని, ఇక నుంచి తామే డెడ్‌లైన్లు పెడతామని స్పష్టం చేశారు. అలా పెట్టేందుకు మీరెవరని ప్రశ్నించే హక్కు రేణుకా చౌదరికి లేదన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, రేణుకాచౌదరి ఏమైనా కుర్చీలు పట్టుకుని పుట్టారా అని ప్రశ్నించారు.

"శ్రీధర్‌బాబుకు చెబుతున్నాం.. తెలంగాణ ఇప్పించే బాధ్యత నీపైనే ఉంది. మీ నాయన (అసెంబ్లీ మాజీ స్పీ కర్ శ్రీపాదరావు)కు ఏమయ్యిందో గుర్తు తెచ్చుకో.. సమాజం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు'' అని హెచ్చరించారు. ఈ నెల 29న గణేష్ నిమజ్జనం జరుగుతుందని, 30న ఆంధ్ర పెత్తనానికి నిమజ్జనం జరగబోతుందన్నారు. "హైదరాబాద్‌లో కాలు మోపుతాం.. సెప్టెంబర్ 30న గాంధీ మార్గంలో మార్చ్ చేపడతాం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం తానిచ్చిన వాగ్దానాన్ని మరిచింది. పోరాటం తప్ప మరో మార్గం లేదు. తెలంగాణ ఇవ్వకుంటే గుంజుకుంటాం.. న్యాయం, సమానత్వం, హక్కుల కోసం హైదరాబాద్‌కు పోతున్నాం'' అని కోదండరాం అన్నారు.

కరీంనగర్ కవాతు అనంతరం సర్కస్ గ్రౌండ్‌లోని సభలో ఆయన మాట్లాడారు. కవాతు ఇక్కడితో ఆగదని, అన్ని జిల్లాల మీదుగా సెప్టెంబర్ 30 వరకు ఒలింపిక్ టార్చ్‌లా సాగుతుందన్నారు. కవాతు శాంతియుతంగా సాగిందని, ఒక్క శ్రీపాదరావు విగ్రహం తప్ప ఎవరూ భయపడలేదన్నారు. విగ్రహం కూలగొడతారేమోనని పోలీసు బలగాలను మోహరించారన్నారు. తమ పోరాటం ఆంధ్రా, రాయలసీమ ప్రజలపై కాదని, ఆంధ్రా, సీమ పాలకులపైనేనని అన్నారు. లగడపాటి, కావూరి సాంబశివరావులతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంటే వారిపై కేసులు పెట్టాల్సింది పోయి.. తెలంగాణవాదులపై ఎందుకు పెడతారని ప్రశ్నించారు.

తెలంగాణలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు క్యూలు కడుతున్నారని, విద్యుత్తు కోతలతో ఇబ్బందులు పడుతున్నారని, ఆంధ్రా ప్రాంతంలో అవేమీ లేవన్నారు. మార్చ్ వల్ల అంతర్జాతీయ సదస్సుకు ఆటంకం ఏమీ కలగదని, తెలంగాణ ఇస్తే సదస్సుకు వచ్చే ప్రతినిధులకు తామే స్వాగతం పలుకుతామన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే గుంజుకుంటామని, బానిసల వలే ఎన్నాళ్లు బతకాలన్నారు.

రాయి రప్పల్లా పడి ఉండడానికి తామేమీ చీము, రక్తం లేనోళ్లం కాదన్నారు. ప్రతి ఇంటికో జెండా, మనిషి రావాలని, హైదరాబాద్‌లో తెలంగాణ కవాతులో పాల్గొ నాలని కోదండరాం పిలుపునిచ్చారు. సభలో జేఏసీ కన్వీనర్ స్వామిగౌడ్, కో ఆర్డినేటర్లు, కో కన్వీనర్లు పిట్టల రవీందర్, మల్లేపల్లి లక్ష్మయ్య, టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ కవాతు కదం తొక్కింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరుకు జేఏసీ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్‌లో 'తెలంగాణ మార్చ్.. కరీంనగర్ టార్చ్' పేరిట మానేరు వంతెన నుంచి సర్కస్ గ్రౌండ్ వరకు కవాతు నిర్వహించారు. కవాతు కరీంనగర్ బస్టాండ్‌కు చేరుకోగానే చౌరస్తాలోని శ్రీపాదరావు విగ్రహం వైపు కొందరు దూసుకు పోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నెల 30వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్‌లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 987వ రోజుకు చేరిన సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు.

30వ తేదీలోగా తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ మార్చ్‌తో సత్తా చాటుతామన్నారు. తెలంగాణ మార్చ్‌ను నిరంకుశంగా అణిచివేయాలని చూస్తే జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ఇవ్వక పోతే కాంగ్రెస్‌పార్టీని వంద అడుగుల లోపల పాతర పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రులు వయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే, గులాంనబీ ఆజాద్ తలో రీతిగా మాట్లాడటం దారుణమన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ యాత్రల పేరిట నాటకాలు చేయొద్దన్నారు. 30వ తేదీలోగా వారు పదవులకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలబడాలన్నారు.

English summary

 Telangana JAC chairman Kodandaram has warned political leaders on Telangana issue. political leaders should participate in Tealangana march on september 30, he told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X