కోదండరామ్ చిచ్చు: కాంగ్రెసు తెలంగాణ నేతల ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu
Kodandaram
హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబుపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయి. తండ్రికి పట్టిన గతే శ్రీధర్ బాబుకు పడుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెసు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఇంటిని కాంగ్రెసు కార్యకర్తలు సోమవారం ముట్టడించారు. కాంగ్రెసు అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాంపై పోలీసు కేసు పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.కోదండరాం చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏదైనా జరిగితే కోదండరాందే బాధ్యతని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఆయన క్షమాపణలు చెప్పాలని మంత్రి సారయ్య డిమాండ్ చేశారు. కోదండరాంపై కేసులు పెట్టే విషయం పోలీసులు చూసుకుంటారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అగ్నిగుండం కావాలని కోదండరాం చూస్తున్నారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. చట్టానికి కోదండరాం అతీతుడు కాదన్నారు.

శ్రీధర్ బాబుపై కోదండరామ్ అవివేకంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. కోదండరామ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కోదండరామ్ ఏ ఉద్దేశంతో మాట్లాడినా ప్రజలు వివిధ రకాలుగా భావిస్తారని ఆయన అన్నారు. కోదండరామ్ వ్యాఖ్యలు హింసావాదానికి దారి తీస్తాయని ఆయన అన్నారు.

తన వ్యాఖ్యలపై కోదండరామ్ వివరణ ఇవ్వాలని తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. లేదంటే జెఎసి కార్యక్రమం వైఫల్యానికి దారి తీస్తుందని ఆయన అన్నారు. శ్రీధర్ బాబుపై కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు శోచనీయమని ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. శ్రీధర్ బాబుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోదండరామ్ ఇంటిని ముట్టడించిన కాంగ్రెసు కార్యకర్తలు డిమాండ్ చేశారు. కోదండరామ్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కాంగర్ెసు నాయకులు సమ్మిరెడ్డి, ఉమేష్ అన్నారు.

ఇదిలావుంటే, తాను చేసిన వ్యాఖ్యలపై కోదండరామ్ వివరణ ఇచ్చారు. తన మాటలను కత్తిరించడం వల్ల సమస్య వచ్చిందని ఆయన అన్నారు. గాంధేయ పద్ధతిలోనే తాము ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రపాలకులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వ్యక్తులపై దాడులకు పురికొల్పడం తన ఉద్దేశం కాదని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు ఆంధ్ర పాలకుల పక్షాన్నే నిలిచారా అని ఆయన అడిగారు. తెలంగాణ మంత్రులే తన ఇంటిపై దాడి చేయించారని ఆయన విమర్శించారు.

అనాగిరక పద్ధతులపై తామకు నమ్మకం లేదని, నాగరిక సమాజాన్నే తాము కోరుకుంటామని ఆయన అన్నారు. రాష్టంలో కంసుడి పాలన సాగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Telangana leaders have opposed Telangana JAC chairman Kodandaram on minister Sridhar babu. They demanded Kodandaram withdraw the comments. Meanwhile Kodandaram clarified on his comments.
Please Wait while comments are loading...