చంద్రబాబు పాదయాత్ర షురూ, తొలిరోజు లోకేష్ ఆకర్షణ

చంద్రబాబు పాదయాత్ర సందర్బంగా హిందూపురం జనసంద్రంగా మారింది. హిందూపురం చేరుకున్న తర్వాత చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్, బావమరిది నందమూరి హరికృష్ణలతో కలిసి సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. సతీమణి భువనేశ్వరి చంద్రబాబు నుదుట తిలకం దిద్ద, హారతిచ్చి పాదయాత్రకు సాంగనంపారు. పాదయాత్ర ప్రారంభానికి హరికృష్ణ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. తొలి రోజు పాదయాత్రలో లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా మిగిలాడు. చంద్రబాబుతో పాటు రెండు రోజుల పాటు లోకేష్ పాదయాత్రలో పాల్గొంటారు.
హిందూపురంలో చంద్రబాబు గాంధీ, అంబేడ్కర్, ఫూలే, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. నిజానికి, పాదయాత్ర మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. చంద్రబాబు వెంట నారా లోకేష్, హరికృష్ణ ఉన్నారు. చంద్రబాబు రోజుకు 15 నుంచి 18 కిలోమీటర్లు నడవాలని సంకల్పించారు. ఆ రకంగా ఆయన పాదయాత్ర 117 రోజులు సాగుతుంది.
చంద్రబాబు చేపట్టిన ఈ పాదయాత్ర 13 జిల్లాల్లో సాగుతుంది. ఆయన పాదయాత్ర వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజు ముగుస్తుంది. వస్తున్నా.. మీ కోసం అంటూ తన పాదయాత్రకు చంద్రబాబు నామకరణం చేశారు. ఇందుకు పాటలు రాయించి, పాడించారు కూడా. దాదాపు 2,200 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేస్తారు.












Click it and Unblock the Notifications