బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు.. 9 మంది మృతి.. ప్రధాని దిగ్భ్రాంతి
గుజరాత్ లో షాకింగ్ ఘటన జరిగింది. అహ్మదాబాద్ లో నగరంలో జూలై 18 న మహమ్మద్ పురా ప్రాంతంలోని గేట్ రోడ్ ప్రాంతంలోని టాలెంట్ ఫైర్ వర్క్స్ బాణసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో కర్మాగారంలో పనిచేసే కార్మికుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. పేలుళ్ల తీవ్రతతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఇప్పటివరకూ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపు 15 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఘటన జరిగిన వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతోపాటు చిన్నారులు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల పూర్తి వివరాలు, వారి కుటుంబ సభ్యుల సమాచారం సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ అహ్మదాబాద్ లోని ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక యంత్రాంగం ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రిలీఫ్ ఫండ్ కింద రూ. 2 లక్షల చొప్పున సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే గాయపడిన వారికి రూ. 50, 000 అందించనున్నట్లు ప్రకటించారు. అటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఈ ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications