భార్యపై కోపం.. 18 రోజుల పసికందు పాలిట మరణశాసనం!
రక్తం పంచుకు పుట్టిన కొడుకు పాలిట కన్న తండ్రే కాలయముడయ్యాడు. మితిమీరిన కోపంతో అభం శుభం తెలియని 18 రోజుల పసి బాబుని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. రోజు రోజుకి సమాజంలో కుటుంబ అనుబంధాలు, మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి అని చెప్పడానికి సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన అద్దం పడుతుంది.
భార్యాభర్తల మధ్య గొడవ
సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో జరిగిన ఈ ఘటన వివరాలలోకి వెళితే పోతురాజు కృష్ణ అనే వ్యక్తి గౌరమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ ప్రేమ పెళ్లి వారిద్దరి జీవితంలో సంతోషం నింపలేదు. తరచూ భార్యాభర్తలిద్దరూ కలహాలు పడుతూ ఉండేవారు. కృష్ణ వాటర్ సప్లై పనిచేస్తూ ఉండగా, ఇంటి వ్యవహారాల విషయంలో ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి.

8రోజుల పసికందును నేలపైకి బలంగా కొట్టిన తండ్రి
నిన్న అర్ధరాత్రి వంట విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఈరోజు ఉదయం కూడా గౌరమ్మ వంట చేయకపోవడంతో కృష్ణలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. క్షణికావేశంలో ఉన్న కృష్ణ మంచంమీద ఉన్న 18రోజుల పసికందును నేలపైకి బలంగా కొట్టాడు. ఈ దాడిలో శిశువు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గౌరమ్మ ఏడుపులు విన్న ఇరుగుపొరుగువారు అక్కడికి వచ్చి చూసి వెంటనే శిశువును జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పసికందు మృతి.. పోలీసులకు ఫిర్యాదు
అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అంబులెన్స్ లో వెళుతున్న క్రమంలోనే మార్గమధ్యలో చిన్నారి ప్రాణాలు విడిచాడు. భర్త కృష్ణ దాడితో 18రోజుల శిశువు మృతి చెందడంతో కన్నీరు మున్నీరైన గౌరమ్మ పోలీసులకు భర్తపైన ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని కృష్ణను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కృష్ణ ప్రతిరోజు తాగివస్తూ రోజు భార్యతో గొడవలు పడతాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.
కసాయి తండ్రిపై చర్యలకు స్థానికుల డిమాండ్
కృష్ణ గౌరమ్మ దంపతులకు గతంలో ఒక బిడ్డ ఉండేవాడని అతను ఫిట్స్ సమస్యతో చనిపోయాడని, ఇప్పుడు గౌరమ్మ రెండవ బిడ్డని కూడా కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు. కడుపుని పుట్టిన బిడ్డను కనీసం కనికరం లేకుండా నేలకేసి కొట్టి ప్రాణాలు తీసిన తండ్రిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సమాజంలో జరుగుతున్న ఇటువంటి ఘటనలు మనుషులలో పెరుగుతున్న క్రూరత్వానికి అద్దం పడుతున్నాయి.












Click it and Unblock the Notifications