ఇదేం విచారణ!?: వాన్‌పిక్ అంశంపై సిబిఐపై మోపిదేవి

సిబిఐ పక్షపాతం చూపుతోందనడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలని ప్రశ్నించారు. వాన్‌పిక్ ప్రాజెక్టు భూకేటాయింపుల నోట్‌ఫైల్స్ అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికే సరిగ్గా అర్థం కానపుడు.. అంతకుముందే ఏడాదే తొలిసారిగా మంత్రయిన తనకు ఎలా అర్థమవుతాయని ప్రశ్నించారు. అన్యాయంగా తనను నాలుగున్నర నెలలుగా జైల్లో ఉంచారని, ట్రయల్ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి లేనందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
వాన్‌పిక్ కేసులో బెయిల్ కోరుతూ మోపిదేవి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో బుధవారం హోరాహోరీ వాదనలు జరిగాయి. వాన్‌పిక్ వ్యవహారంలో ఒకే రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా... మంత్రి ధర్మానను ముట్టుకోని సిబిఐ, తనను అరెస్టు చేయడమే కాకుండా అంతా తన తప్పిదమే అన్నట్లు మాట్లాడ్డంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన మోపిదేవి, తాజాగా సిబిఐపై మరో అస్త్రం సంధించారు.
ఓఎంసీ కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఒక కేసులో మంత్రిది తప్పులేదన్నట్లుగా దర్యాప్తు కొనసాగించిన సిబిఐ, వాన్‌పిక్ కేసులో మంత్రిదే తప్పని ఎలా చెబుతుందన్నారు. ఇది వివక్షాపూరితంగా సాగుతున్న దర్యాప్తని ఆరోపించారు. వాన్‌పిక్ విషయంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదించినవేనని, అందులో ఏవైనా ఉల్లంఘనలు జరిగినట్లుగానీ, తమని మోసం చేశారనిగానీ ఒక్క మంత్రి అయినా సిబిఐకి చెప్పలేదని పేర్కొన్నారు.
రెండు ప్రభుత్వాలకు మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా వాన్‌పిక్ ఏర్పడితే దాన్ని సిబిఐ ఎలా తప్పుబడుతుందని, పైగా ఆ ప్రాజెక్టు ఏర్పాటు నా ఆలోచనే అన్నట్లుగా సిబిఐ మాట్లాడుతోందని మోపిదేవి అన్నారు. దీనిపై సిబిఐ న్యాయవాది స్పందిస్తూ.. తాము ఒప్పందాన్ని తప్పుబట్టడం లేదని, వాన్‌పిక్ పోర్ట్సుకు చెందాల్సిన భూముల్ని.. వాన్‌పిక్ ప్రాజెక్ట్సుకు వెళ్లేలా చేయడాన్నే తప్పుబడుతున్నామని స్పష్టం చేశారు.
తర్వాత డిఫెన్స్ న్యాయవాది వాదిస్తూ.. వాన్‌పిక్ ఫైల్ సంబంధిత శాఖలకు వెళ్లలేదనడం కరెక్టు కాదని, ఆయా శాఖల కార్యాలయాలకు వెళ్లినట్లు ఆధారాలున్నాయని కోర్టుకు చెప్పారు. మోపిదేవికి వ్యతిరేకంగా ఆధారాల్లేవని, ఒకవేళ ఉన్నాయని సిబిఐ చెప్పినా, బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని, 2జీ కేసులో సంజయ్‌చంద్రకు బెయిల్ రావడమే దానికి రుజువని పేర్కొన్నారు. దాంతో పోలిస్తే వాన్‌పిక్ ఎంతో చిన్నదని వ్యాఖ్యానించారు. అన్యాయంగా జైల్లో పెట్టినందున మోపిదేవికి ఇకనైనా బెయిల్ ఇవ్వాలని కోరారు.
వాన్‌పిక్‌లో తీవ్ర ఉల్లంఘనలు జరిగినట్లు కాగ్ సైతం చెప్పిందని సిబిఐ అనడంపై డిఫెన్స్ న్యాయవాది మాట్లాడుతూ.. ఆ నివేదిక ట్రాష్ అని కేంద్రమే సుప్రీంకోర్టుకు చెప్పిందని గుర్తుచేశారు. అలాంటి నివేదికను సిబిఐ ఎలా ప్రస్తావించగలుగుతుందని ప్రశ్నించారు. అయితే తాము ఏ కేసులో అయినా వారి వారి పాత్రను బట్టి ప్రశ్నిస్తామని, అవసరమైతే అరెస్టు చేస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును 9వ తేదీకి వాయిదా వేశారు.
కాగా రస్ అల్‌ఖైమా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని దివంగత వైయస్ ముఖ్యమంత్రిగా ఉండగా సిఎంఓలో ప్రత్యేక కార్యదర్శిగా పని చేసిన ఐఏఎస్ అధికారి భాను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. వాన్‌పిక్ వ్యవహారంలో రస్ ఆల్‌ఖైమాకు చెందిన ప్రతినిధులెవరినీ తాను కలవలేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications