జగన్ కేసు: ఈడి జప్తుపై షర్మిళ, విజయమ్మ ఫైర్

"ఈడీనుంచి మేం ఇవాళ నోటీసు అందుకున్నాం. సాక్షి ఆస్తులను అటాచ్ చేస్తున్నామంటూ నోటీసు ఇచ్చింది. ఈడీ నోటీసులో హెటిరో, అరబిందో కంపెనీలు అక్రమంగా రూ.22 కోట్లు లబ్ధిపొందాయని పేర్కొన్నారు. దీనికి ప్రతిఫలంగా వైఎస్ జగన్ కంపెనీల్లో రూ.29కోట్లు పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. రూ.22కోట్లు లబ్ది పొందితే... రూ.29కోట్లు పెట్టుబడి ఎలా పెడతారు? సాధారణ వ్యక్తికైనా ఇది అర్థమవుతుంది. ఆస్తుల అటాచ్ మెంట్ ఎంత అర్థలేనిదో దీనిబట్టి అర్థమవుతుంది" అని షర్మిళ అన్నారు.
"జగన్ ఆస్తులకేసును, ఈఎమ్మార్ కేసును సీబీఐ ఒకేసారి విచారిస్తోంది. కాని, చంద్రబాబుపై ఇప్పటివరకూ ఎలాంటి దర్యాప్తు చేయలేదు. చంద్రబాబు అక్రమాలపై ఇప్పటివరకూ సీబీఐ దృష్టే పెట్టలేదు. ఐఎంజీ కేసులోనూ ఇప్పటివరకూ చంద్రబాబును ప్రశ్నించలేదు. టీడీపీ ఎంపీలు ఈరోజు చిదంబరంని కలిశారు. ఈడీ వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టబట్టారు. అది జరిగిన రెండుగంటలకే ఈడీ నోటీసు ఇచ్చింది. జగన్ ను రాజకీయంగా అంతంచేయడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందనుకున్న సమయంలో న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు" అని విమర్శించారు.
"సీబీఐ తనకు తానుగా లాయర్లను మార్చుకుంటే దానిపై రాద్ధాంతం చేశారు. గత విచారణ సమయంలో మా న్యాయవాదులు సన్నద్ధంగా లేరని సీబీఐ వాయిదా కోరింది. రేపు విచారణకు వస్తున్న సమయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు. జగన్ విడుదల కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. వారందరి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇలాంటి చీప్ ట్రిక్స్ కు న్యాయవ్యవస్థ లొంగదనే భావిస్తున్నాం. దేవుడిపై మాకు నమ్మకం ఉంది" అని షర్మిళ పేర్కొన్నారు.
క్విడ్ ప్రో కో కేసులో రూ.51కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ప్రకటన చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు బెయిల్ వస్తుందనుకున్న తరుణంలో ఈడీ ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. వైయస్ జగన్ కు బెయిల్ వస్తుందనుకున్న తరుణంలో ఆయన క్షేమంకోసం ప్రపంచంలో వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులంతా ప్రార్థనలు చేశారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తులను అటాచ్ చేస్తున్నామంటూ ఈడీ ప్రకటన ఇచ్చిందన్నారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో చిదంబరంను కలిసి ఆస్తులను అటాచ్ చేయమని అడిగిన వెంటనే ఈడీ ప్రకటన రావడం వెనుక కుట్ర దాగుందన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.
రేపు జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న సమయంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయని తెలిపారు. చంద్రబాబు రాసిన లేఖను టీడీపీ ఎంపీలు చిదంబరంకు అందజేసిన వెంటనే ఈడీ ప్రకటన వచ్చిందని అన్నారు. కోర్టును ప్రభావితం చేసేలా ఈడీ ప్రకటన ఉందన్నారు. బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడల్లా సీబీఐ అనుబంద చార్జిషీట్లు వేస్తోందని గుర్తు చేశారు. 14 నెలలుగా విచారణ జరుపుతున్న సీబీఐ జగన్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా చూపలేకపోయిందన్నారు. జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ న్యాయవాదిని తామే మార్చామనే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వివాదస్పద 26 జీవోలకు సంబంధించిన విచారణ ఏమైందో తెలియలేదన్నారు. తాము భయపడడం లేదని, వాస్తవాలను ప్రజలకు తెలపాలన్న ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చామని విజయమ్మ చెప్పారు.












Click it and Unblock the Notifications