కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు యాత్ర ఎఫెక్ట్, బైరెడ్డికి తెలుగు తమ్ముళ్లు దూరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Byreddy Rajasekhar Reddy
కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్ర ప్రభావం బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆత్మగౌరవ యాత్రపై పడినట్లే ఉంది. బైరెడ్డి వెంట నడుస్తారని భావించిన నాయకులు కూడా ఇప్పుడు చంద్రబాబు పాదయాత్రలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేపట్టిన రాయలసీమ ఆత్మ గౌరవ యాత్రకు తెలుగు తమ్ముళ్లు దూరంగానే ఉంటున్నారు. ఆయన పాదయాత్రలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులెవరూ కనిపించడం లేదు. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఆయన పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ అంశంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో రాయలసీమ అంశం లేదన్న కారణంతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

ఆయన రాజీనామాతో నందికొట్కూరు నియోజకవర్గంలోని కొద్ది మంది అనుచరులు పార్టీకి వీడ్కోలు చెప్పి ఆయన వెంట నడుస్తున్నారు. బైరెడ్డి వెంట ఇద్దరు ముగ్గురు టిడిపి ప్రధాన నాయకులు వెళ్తారని మొదట ప్రచారం జరిగింది. వీరు పాదయాత్రలో పాల్గొని కదం కలుపుతారని బైరెడ్డి వర్గీయులు స్పష్టం చేశారు. అయితే వారనుకున్నట్లు ఎవరూ బైరెడ్డి వెంట నడవడం లేదు. సొంత నియోజకవర్గానికి టిడిపి ఇన్‌చార్జిగా ఉన్న బిచ్చన్న సైతం పార్టీని వీడబోనని పేర్కొంటూ చంద్రబాబు నాయుడు చేపట్టిన మీ కోసం వస్తున్నా యాత్రలో పాల్గొనేందుకు హిందూపురం వెళ్లారు. దాంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి సొంత నియోజకవర్గమైన నందికొట్కూరులో ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే వెంట నడిచారు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన పాణ్యం నియోజకవర్గం నుంచి ఎవరూ వెంట రాకపోవడం గమనార్హం. కాగా ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదనే ఎవరూ తామున్న పార్టీలను వీడేందుకు ముందుకు రావడం లేదని విశే్లషకులు పేర్కొంటున్నారు. రాష్ట్ర రాజకీయ ఒడిదుడికుల మధ్య నలిగిపోవడం ఇష్టం లేక ఎన్నికల సమయంలో నిర్ణయాలు తీసుకోవచ్చన్న అభిప్రాయం వారిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బైరెడ్డి వెంట ఆ పార్టీ నాయకులు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రే అయి ఉండవచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు తన యాత్రతో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతూ ఇపుడు పార్టీని వీడి ఇబ్బందులు పడకూడదన్న భావనతో ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోయి ఉండవచ్చని అంటున్నారు.

మరో వైపు బైరెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఆయన ఏ మేరకు సఫలీకృతులవుతారో చూసి తరువాత నిర్ణయం తీసుకుంటామన్న ఆలోచనతో ఇప్పటికిపుడు బైరెడ్డి వెంట రాకపోయి ఉండవచ్చని వెల్లడిస్తున్నారు. కాగా తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలం ఉండి నంద్యాల పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పరిచయాలు పెంచుకున్న బైరెడ్డి ఆయా నియోజకవర్గాల్లోని టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను ఎక్కడ ఆకర్షిస్తారోనన్న ఆందోళనతో పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముందు జాగ్రత్త చర్యగా పార్టీ నాయకులు, కార్యకర్తలెవరూ బైరెడ్డి పాదయాత్రలో పాల్గొనడం కాని, ఆహ్వానం పలుకడం కాని చేయవద్దని, యాత్రకు దూరంగా ఉండాటని ప్రకటన చేశారు. బైరెడ్డి సొంత నియోజకవర్గంలో రెండో రోజు పాదయాత్ర సందర్భంగా భారీ ఎత్తున టిడిపి కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికి ఆయనతో కదం కలిపారు.

మూడో రోజు బైరెడ్డికి మంచి పట్టు ఉన్న పాములపాడు, ఆత్మకూరు మండలాల్లో పర్యటన కొనసాగనుంది. శ్రీశైలం నియోజకవర్గంలో కొంత మేర ఆయన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఆ తరువాత నంద్యాల నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు పార్టీని వీడకున్నా ఆయనను అనుసరించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. జిల్లాలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బైరెడ్డి పాదయాత్రల్లో భాగంగా రెండవ రోజు నందికొట్కూరులో బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోరుకునే వారెవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా తనతో కలిసి రావచ్చని పిలుపునిచ్చారు.

పార్టీలకతీతంగా సాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు అవసరమని అయితే తాము మాత్రం ఏ పార్టీ మద్దతు కోరబోమని ఆయన అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న అభిప్రాయం ఉన్న వారు నాయకులైనా, కార్యకర్తలైనా సామాన్యులైనా ఆహ్వానితులే అంటూ తన యాత్రలో ప్రజలను భాగస్వాములను చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో బైరెడ్డి ఏ మేరకు సఫలీకృతుడై మున్ముందు బలమైన నాయకుడిగా ఎదుగుతారా లేదా అన్న అంశం ప్రస్తుతం రాజకీయాల్లో వేడి పుట్టిస్తోందన్న చర్చ సాగుతోంది.

English summary
Telugudesam party president N Chandrababu Naidu padayatra has affected Byreddy Rajasekhar Reddy's Rayalasemma self respect yatra. TDP local leaders are not following Byreddy Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X