• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లక్ష కోట్లు జప్తు చేయించేవాళ్లం: విజయమ్మపై టిడిపి ఫైర్

By Pratap
|

Telugudesam Party
న్యూఢిల్లీ/ హైదరాబాద్: వైయస్ జగన్ ఆస్తుల్ని తమ పార్టీ జప్తు చేయించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు తిప్పికొట్టారు. నిజంగా తాము చేయించి ఉంటే రూ.51 కోట్లతో సరిపెట్టేవాళ్లం కాదని, జగన్ ఆస్తి రూ.లక్ష కోట్ల మొత్తాన్నీ జప్తు చేయించే వాళ్లమని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. దేశంలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు రాసిన లేఖను శుక్రవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ఎంపీల బృందం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి అందజేసింది. కొనకళ్ల నారాయణరావు, సీఎం రమేశ్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, గుండు సుధారాణి, రమేశ్ రాథోడ్ ఈ బృందంలో ఉన్నారు.

అవినీతి కుంభకోణాలపై విచారణలు జరుగుతున్నాయి కదా అని ప్రధాని వ్యాఖ్యానించారని, అయితే ఆ విచారణల్లో జాప్యం జరుగుతోందని, ఈ లోపు నిందితులంతా బయటికొచ్చి, ప్రజల నుంచి దోచుకున్న ధనంతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారని చెప్పినట్లు నామా తెలిపారు. తక్షణం స్పందించి కుంభకోణాలను నివారించేందుకు, అవినీతి పరులపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సూచించిన మార్గాలను అనుసరించాలని కోరామన్నారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారని నామా తెలిపారు.

రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ అవినీతిపై 2006 నుంచే తాము పోరాటం చేస్తున్నామని నామా నాగేశ్వర రావు విజయమ్మ ఆరోపణలపై స్పందిస్తూ తెలిపారు. ఆనాడే కేంద్రం స్పందించి ఉంటే ఇప్పుడు ఈ బాధలు తప్పేవన్నారు. నిజానికి విజయలక్ష్మి ప్రశ్నించాల్సింది, అనుమానించాల్సింది తమను కాదని.. "కొడుకా.. నాయన ముఖ్యమంత్రి కాగానే ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది?'' అని జగన్‌ను ప్రశ్నించాలని సూచించారు. తామే చేయిస్తే రూ.51 కోట్లతో ఆపేవాళ్లం కాదని, జగన్ ఆస్తి మొత్తం రూ.లక్ష కోట్లు జప్తు చేయించే వాళ్లమని సీఎం రమేశ్ చెప్పారు.

ఈ మాత్రం దానికే గుండెలు బాదుకుంటున్న వైయస్ విజయమ్మ గతంలో వాన్‌పిక్ భూముల్లో ఉన్న పేదల గుడిసెలను తొలగించేసినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ ఆస్తుల్లో ఇంకా రూ.99,949 కోట్లు జప్తు కావాల్సి ఉందని చెప్పారు. దేశంలో ఉన్న రాజకీయ అవినీతి పరులు అందరినీ శిక్షించాలని తాము కోరామే తప్ప ఎవరిపైనా పేరుపెట్టి ఫిర్యాదు చేయలేదని మోదుగుల తెలిపారు.

"జగన్ వ్యాపార చాతుర్యం చూసి ఆకర్షితులై ఆయన కంపెనీల్లో అనేక మంది పెట్టుబడులు పెట్టారని, ఆ పెట్టుబడులకు, అధికారానికి సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు నేతలు వాదిస్తున్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత అలాంటి పెట్టుబడులు ఎందుకు రావడం లేదు? ఆయన చనిపోగానే జగన్ వ్యాపార సామర్థ్యంపై నమ్మకం పోయిందా? తన కొడుకు అమాయకుడని వాదిస్తున్న విజయలక్ష్మి దీనికి ఏం సమాధానం చెబుతారు'' అని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హైదరాబాదులో ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పదవి ఉండబట్టే ఆ కుటుంబానికి వేల కోట్ల ఆదాయం, బంగళాలు, కార్లు, బ్యాంకు బ్యాలెన్సులు, వందల ఎకరాల భూములు వచ్చాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇవన్నీ తన కొడుకు కష్టపడి సంపాదించారని ఆమె చెప్పగలరా అని ఆయన సవాల్ విసిరారు.

జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 71 కంపెనీల్లో 14 కంపెనీలు కోల్‌కతాకి చెందినవేనని, వాటికి ఊరూపేరులేదని ఆయన వివరించారు. ఆ కంపెనీలు ఎందుకు పెట్టుబడి పెట్టాయో, వాటి పేరుమీద ఎవరు పెట్టుబడి పెట్టారో తేలాల్సి ఉందని రామయ్య అభిప్రాయపడ్డారు. జగన్ రూ 43 వేల కోట్లు అక్రమంగా కూడబెట్టారని సీబీఐ నిర్ధారిస్తే.. ఈడీ కేవలం రూ. 51 కోట్ల విలువైన ఆస్తులు మాత్రం ్ఞఅటాచ్‌మెంట్ చేసిందని చెప్పారు. అనకొండను పట్టుకొంటారనుకొంటే ఎలుక పిల్లను పట్టుకొన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుంటే వైఎస్ విజయలక్ష్మి, షర్మిళ తమపై విరుచుకుపడతారెందుకని టీడీపీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులు చిదంబరాన్ని ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేయగానే ఈడీ అటాచ్‌మెంట్ చేసిందన్న ఆరోపణ పచ్చి అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి తాము 2006నుంచే పోరాటం చేస్తున్నామని, కేంద్రం వాటిపై ఒక్కసారైనా చర్య తీసుకోలేదని ఆయన వివరించారు.

ఇప్పుడు కేవలం కోర్టు ఆదేశాలతో మాత్రమే సిబిఐ, ఈడీ పనిచేస్తున్నాయని గోరంట్ల స్పష్టం చేశారు. చంద్రబాబు పాదయాత్రపై పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ విమర్శలపై ఆయన మండిపడ్డారు. "ఆయన బొంకుల సత్తిబాబు. ఆయన అన్నం తినడం మానేసి గడ్డి తింటున్నారు. వోక్స్ వ్యాగన్ గడ్డితో అది మొదలైంది. ఆయన నోటివెంట అలాంటి మాటలే వస్తున్నాయి. ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేక.. ప్రతిపక్ష నేత వెళ్తుంటే భరించలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారు'' అని ఆయన విమర్శించారు.

English summary
Telugudesam leaders retaliated YSR Congress party honorary president YS Vijayamma comments on YS Jagan case. Nama Nageswar Rao and CM Ramesh and others said that YS Vijayamma should has been asked about YS Jagan income sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X