బాబుపై షర్మిల దాడి: సునీత నియోజకవర్గంలో యాత్ర

మరో ప్రజా ప్రస్తానం యాత్రలో షర్మిల కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై విరుచుకు పడ్డారు. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తారని ఆమె నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల కోసం కాకుండా కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. ప్రజా సమస్యలపై బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే వారన్నారు. బాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రంలో పాలన పడకేసినప్పటికీ అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదంటేనే వారి కుమ్మక్కు రాజకీయాలు అర్థమవుతున్నాయన్నారు. తన సోదరుడు వైయస్ జగన్‌ను ఇరు పార్టీలు కలిసి కుట్ర చేసి జైలుకు పంపించాయన్నారు. జగన్ ప్రజల కోసమే ఉన్నారన్నారు. ఆయన గతంలో 103 జ్వరంతోనూ దీక్షలు చేపట్టారన్నారు. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, వాటిని కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు.
వైయస్ అమలు చేసిన గొప్ప పథకాల్లో అభయహస్తం ఒకటన్నారు. వైయస్ పథకాలు అమలు కావాలంటే జగన్ అధికారంలోకి రావాలన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే జగన్ ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం చేపడతారన్నారు. 50 ఏళ్లకే చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తారన్నారు. పాదయాత్రలో షర్మిలతో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications