వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్దతు ఉపసంహరిస్తున్నాం: అసదుద్దీన్, జగన్ ఫ్రెండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: మతతత్వవాదులకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాము 1998 నుండి కాంగ్రెసు పార్టీకి మద్దతిస్తున్నామని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం అన్నారు. 98లో బిజెపికి టిడిపి మద్దతివ్వడంతో అప్పటి నుండి కాంగ్రెసుతో దోస్తీ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. టిడిపి, బిజెపి హయాంలో తాము చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. 2004లో కాంగ్రెసు అధికారంలోకి రావడంలో మజ్లిస్‌దే కీలక పాత్ర అన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొణిజేటి రోశయ్య హయాంలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన అల్లర్లలో ముస్లింలు నష్టపోయారన్నారు. ఆదోనిలో జరిగిన అల్లర్లలో ముస్లింలకు చెందిన దుకాణాలను తగులపెట్టారన్నారు. సంగారెడ్డిలో అల్లర్లకు పాల్పడిన వారిని అరెస్టు చేయలేదన్నారు. అల్లర్లకు పాల్పడిన వారికి ఎమ్మెల్యే మద్దతిస్తున్నారని విమర్శించారు.

గత మూడేళ్లలో సంగారెడ్డి, సిద్దిపేట, ఆదోనీలలో ముస్లింలపై దాడులు జరిగాయన్నారు. మాదన్నపేటలో జరిగిన అల్లర్లకు సంఘ్ పరివార్ కారణమని ఆరోపించారు. వరుసగా జరుగుతున్న ఘటనలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నివేదించారని, ఆయన నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు. పాతబస్తీలో సబ్జి మండీని ఐదు రోజుల పాటు మూసేయించారని విమర్శించారు. తాము చేసిన తప్పేంటో చెప్పాలన్నారు.

చాలాచోట్ల సంఘ్ పరివార్ జంతు వధను అడ్డుకుందని ఆరోపించారు. అల్లర్లను సంఘ్ పరివార్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. చారిత్రక చార్మినార్‌ను రక్షించుకునేందుకే తమ పోరాటం అన్నారు. బాబు హయాంలో తనపై పోలీసులు దాడి చేశారన్నారు. మళ్లీ 2010 నుండి వరుస ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బక్రీద్ సందర్భంగా ఆవులతో పాటు ఇతర జంతువులను కూడా వధించకుండా ప్రభుత్వం అడ్డుకుందన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నారన్నారు. ఇంకా ఎన్నాళ్లు సహనంతో ఉండాలని ధ్వజమెత్తారు. సహనంతో ఎంతగా చెప్పినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. భాగ్యలక్ష్మి ఆలయం అలంకరణ విషయంలో కోర్టు నిర్ణయాలను ఎందుకు అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం పట్టించుకోనట్లుగా వ్యవహరించినంత మాత్రాన ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ముస్లిం యువత వీధుల్లోకి వచ్చి ప్రశ్నిస్తున్నారని, ప్రజాప్రతినిధులమైన తమనూ నిలదీస్తున్నారన్నారు.

ఎమ్మెల్యేలకు ఫోన్ సేవలు నిలిపివేయడంలోని ఆంతర్యమేమిటన్నారు. కిరణ్ నేతృత్వంలోని ప్రభుత్వం లౌకికవాద ప్రభుత్వం కాదనేది తమ అభిప్రాయమన్నారు. కిరణ్ వైఖరి కారణంగా తాము మద్దతు ఉపసంహరించుకున్నామని చెప్పారు. తాము రాష్ట్రంలో కిరణ్ ప్రభుత్వానికి, కేంద్రంలో యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాన్నామని చెప్పారు. సంఘ్ పరివార్‌కు అండగా ఉంటున్న ఈ ప్రభుత్వానికి తాము మద్దతివ్వలేమన్నారు.

పాతబస్తీలోని ప్రజలు స్వేచ్ఛగా జీవించలేక పోతున్నారన్నారు. ఈ ప్రభుత్వం పాతబస్తీని కర్ఫ్యూ పరిస్థితుల్లోకి నెట్టేసిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గతంలో తన స్నేహితుడు అని, జగన్ ఇప్పుడు తన స్నేహితుడు అని అసదుద్దీన్ అన్నారు. కిరణ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లుగా తాము గవర్నర్‌కు, యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లుగా తాము రాష్ట్రపతికి లేఖ ఇస్తామన్నారు. దేశ చట్టం, న్యాయవ్యవస్థలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.

తాము రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ వైఖరిని ప్రచారం చేస్తామన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పోలీసు బలగాలతో తమను అడ్డుకోలేరన్నారు. మద్దతు ఉపసంహరణపై తాము వెనక్కి తగ్గేది లేదన్నారు.

English summary
MIM withdrawn support to Kiran Kumar Reddy and UPA government on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X