ఉగ్రవాదంపై 'నో కాంప్రమైజ్': ప్రధాని మోదీ సంచలనం
ఉగ్రవాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై నో కాంప్రమైజ్.. నో డబుల్ స్టాండర్డ్స్ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ దేశాల వైఖరి స్పష్టంగా ఉండాలని తెలిపారు. ఈ మేరకు పాకిస్థాన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద చర్యలను కొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమర్థించుకోవడం సరికాదని హితవు పలికారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పోరాడాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం నార్వే పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన 3వ ఇండియా- నార్డిక్ శిఖరాగ్ర సదస్సు లో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ సదస్సులో భారత్ తోపాటు ఐదు నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్ లాండ్, డెన్మార్క్ లు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటనలో గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని అలాగే దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 2025 లో జరిగిన ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించాయి. సరిహద్దులో ఉగ్రవాదాన్ని అంతం చేయాలని పేర్కొన్నాయి. అలాగే ఉగ్రవాదానికి అందుతున్న నిధులను అడ్డుకోడానికి ఐక్యరాజ్యసమితి, ఎఫ్ఏటీఎఫ్ వేదికల ద్వారా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేతలు తీర్మానించారు.

ఉక్రెయిన్- రష్యా యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అయినా కేవలం సైనిక చర్యల ద్వారా ప్రపంచ శాంతి రాదని, చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. క్లీన్ ఎనర్జీ, డిజిటలైజేషన్, వాణిజ్యం, గ్లోబల్ సప్లై చైన్ సురక్షితం చేయడం వంటి అంశాలపై నార్డిక్ దేశాల ప్రధానులతో మోదీ విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇటీవల భారత్- ఈఎఫ్టీఏ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం ద్వారా నార్డిక్ దేశాల నుంచి భారత్ లో పెట్టుబడులు భారీగా పెరగనున్నాయని ఇది సరికొత్త సువర్ణ అధ్యాయానికి నాంది అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications