ఇప్పటికే చిరు కల్సిపోయారు: బాబు, యాత్రలో లోకేష్

పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు పలుచోట్ల మాట్లాడారు. తాను గానీ, టిడిపి కానీ తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, భవిష్యత్తులో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడనని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరూ ఉండకుండా కాంగ్రెసు కుట్ర పన్నిందన్నారు. పిఆర్పీ ఇప్పటికే కాంగ్రెసులో కలిసిందని, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసులు కూడా త్వరలో కలవడం ఖాయమన్నారు.
కాంగ్రెసు తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని నిలువునా దోచిందన్నారు. సోమవారం ఉదయం జిల్లాలోని కోటగిరి మండలం ఎత్తొండ పంటక్రాస్ రోడ్స్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. టిడిపి అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీపై మొదటి సంతకం, బెల్లు షాపుల రద్దుపై రెండో సంతకం చేస్తానన్నారు. ఈ జిల్లాలో నిజాంసాగర్, మంజీరా ఉన్నా మంచినీళ్లకు తీవ్ర కొరత ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో మంచినీళ్లు నిల్, మద్యం ఫుల్ అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లక్షల కోట్లు దోచుకుని వారి కుటుంబాలకు దోచిపెట్టారని ఆరోపించారు. తీవ్రవాదం కన్నా ప్రమాదమైనది అవినీతి అని, దీనిపై రాజీలేని పోరాటం చేయాలని బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. మొదటి నుంచి టిడిపి అవినీతిని వ్యతిరేకిస్తూనే వస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications