ఢిల్లీకి చంద్రబాబు, పవన్ - కేబినెట్ లో మరో బెర్తు.. కీలక నిర్ణయాలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్రంలో మోదీ తన 12 ఏళ్ల ప్రధాని పదవీ కాలం పూర్తి చేసుకొని కొత్త రికార్డు నెలకొల్పారు. అదే విధంగా మూడో సారి అధికారం లోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతోంది. దీంతో.. ఎన్డీఏ పాలిత సీఎంలు.. డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. కీలక బిల్లుల ఆమోదంతో పాటుగా.. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఈ భేటీలో మోదీ దిశా నిర్దేశం చేయనున్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన పైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ రేపు (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 10న జరిగే ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వీరు పాల్గొననున్నారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరుకానుండగా, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా, త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్ర, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా చర్చలు జరగవచ్చని సమాచారం.

కేంద్ర కేబినెట్.. పదవుల పై చర్చ
కాగా, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టు లు, కేంద్ర సహాయ నిధులు, పెండింగ్‌లో ఉన్న విభజన హామీలపై సీఎం చంద్రబాబు కేంద్ర నాయకత్వంతో చర్చించే అవకాశం ఉంది. ఇక.. కేంద్రంలో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఎవరికి ఛాన్స్ ఉంటుందనేది ఈ భేటీ తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఎవరిని ఈ పదవి కోసం సిఫారసు చేస్తారనేది కీలకంగా మారుతోంది. తాజాగా ఏపీ నుంచి నలుగురు అభ్యర్ధులు రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసారు. వారి ఎంపిక లాంఛనమే. దీంతో.. చంద్రబాబు, పవన్ ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications