తెలంగాణ: అఖిలపక్షానికి టిడిపి నుండి మళ్లీ ఇద్దరు?
హైదరాబాద్: ఈ నెల 28వ తేదిన తెలంగాణపై కేంద్రం నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ ఇద్దరు ప్రతినిధులను పంపాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. 2009లో జరిగిన అఖిల పక్ష సమావేశానికి టిడిపి ఇద్దరిని పంపించింది. ఈసారి కూడా కేంద్రం ఇద్దర్ని పిలవడంతో అలాగే పంపించాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. గతంలో మాదిరిగా ఇరు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని పంపేందుకే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు చంద్రబాబు దీనిపై స్పష్టంగా ఎవరికీ సంకేతాలు ఇవ్వలేదట. ఆయన మనసులో ఏముందో తెలుగు తమ్ముళ్లకెవరికీ అర్థం కావడం లేదట. ఇటీవలి కాలంలో జరిగిన సంభాషణలు, సమావేశాల్లో ఆయన మాటలను బట్టి ఇద్దరు ప్రతినిధులను పంపాలను సంకేతాలే వస్తున్నాయని మాత్రం తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. అఖిలపక్షానికి ముందుగానే పార్టీ ప్రతినిధులతో ఒకసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
కిందటిసారి కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పార్టీ నుంచి యనమలరామకృష్ణుడు, రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం జరగనున్న సమావేశానికి కూడా వారినే పంపిస్తారా లేదా ఇతర నేతలను పంపిస్తారా అనేది ఇంకా నిర్ణయించలేదు. అలాగే వేరే వారిని పంపిస్తే ఏయే ప్రాంతం వారిని పంపించాలనే విషయంపై కూడా బాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సీమ నుండి కూడా డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా టిడిపినే కేంద్రాన్ని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆ సమావేశంలోనే తమ వైఖరిని చెబుతామని పేర్కొంటూ కేంద్రానికి లేఖ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలనుంచి ప్రతినిధులను పంపినా.. సమావేశంలో మాత్రం తెలంగాణకు వ్యతిరేకం కాదనే వాదనను వినిపిస్తారని తెలుస్తోంది. గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని అయితే అధికారంలో ఉన్నది మీరు కాబట్టి నిర్ణయం మీరే మొదట చెప్పాలని కాంగ్రెస్‌ను నిలదీసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications