తెలంగాణ: రాజకీయ పార్టీలకు ఆల్ పార్టీ ఫీవర్
హైదరాబాద్: రాజకీయ పార్టీలకు ఈ నెల 28వ తేదీన తెలంగాణపై జరిగే అఖిలపక్ష సమావేశం ఫీవర్ పట్టుకుంది. అఖిల పక్ష సమావేశంలో ఏం చెప్పాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాలపై రాష్ట్రానికి చెందిన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇప్పటి వరకు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పలేదు. దీంతో ఈ మూడు పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయనే విషయం ఆసక్తిగా మారింది. తెలంగాణపై తమ వైఖరిని అడగడానికి ముందు కాంగ్రెసు వైఖరి వెల్లడించాలని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పాదయాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తెలంగాణ ప్రాంత నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుపై ఆయన చర్చించారు. రేపు బుధవారం సీమాంధ్ర నాయకులతో ఆయన మాట్లాడుతారు. ఈ నెల 27వ తేదీన అఖిల పక్ష సమావేశంలో అఖిలపక్ష సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుపై, ఆ సమావేశానికి వెళ్లాల్సిన ప్రతినిధులపై పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకుంటుంది.

అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీపరంగా అఖిల పక్ష సమావేశంలో ఒకే అభిప్రాయం చెప్తామని చంద్రబాబుతో భేటీ అనంతరం తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. గతంలో జరిగిన నిర్ణయాన్ని అఖిలపక్ష సమావేశంలో వెల్లడిస్తామని వారు చెప్పారు. అఖిల పక్ష సమావేశానికి ఎందరం వెళ్లినా ఒకే అభిప్రాయం చెప్తామని వారన్నారు. చంద్రబాబు రాసే లేఖతో తాము అఖిల పక్ష సమావేశానికి వెళ్తామని వారన్నారు.
తెలంగాణపై అన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు డిమాండ్ చేశారు. సిపిఎం తరఫున అఖిల పక్ష సమావేశానికి రాఘవులతో పాటు శానససభ్యుడు జూలకంటి రంగారెడ్డి వెళ్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతంతో మోసం చేస్తున్నాయని రాఘవులు విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను తిరస్కరించారా, ఆమోదించారా చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ నిర్ణయమూ తీసుకోలేనప్పుడు శ్రీకృష్ణ కమిటీని ఎందుకు వేశారని ఆయన అడిగారు. సిపిఎం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
బిజెపి తరఫున అఖిలపక్ష సమావేశానికి ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, సీమాంధ్ర నాయకుడు హరిబాబు వెళ్తున్నారు. తమకు రాష్ట్రంలో ఒక్క పార్లమెంటు సభ్యుడు లేకున్నా తాము తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని కిషన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ బలపడితేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. సిపిఐ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, గుండా మల్లేష్ అఖిల పక్ష సమావేశానికి హాజరవుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా సిపిఐ నిర్ణయం తీసుకుంది.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు తరఫున బాజిరెడ్డి గోవర్దన్ (తెలంగాణ), సీమాంధ్ర నాయకుల్లో మైసురారెడ్డి లేదా కొణతాల రామకృష్ణ వెళ్లే అవకాశం ఉంది. హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను సోమవారం మైసురారెడ్డి కలిసి ఆయనతో మాట్లాడారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి ఎవరు వెళ్లాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కసరత్తు చేస్తోంది.
ఇదిలావుంటే, కాంగ్రెసు తరఫున గాదె వెంకటరెడ్డి (సీమాంధ్ర), కె. కేశవరావు (తెలంగాణ) వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కాంగ్రెసు తరఫున కావూరి సాంబశివ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖర రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మజ్లీస్ తరఫున అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ సమావేశంలో పాల్గొంటారని అంటున్నారు. మజ్లీస్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రం సై అంటోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో పాటు నాయని నర్సింహా రెడ్డి పాల్గొంటారని అంటున్నారు. తనతో పాటు తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను తీసుకుని వెళ్లాలని కెసిఆర్ అనుకున్నారు. కానీ, బిజెపి వంటి ఇతర పార్టీల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో కోదండరామ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications