గ్యాంగ్‌రేప్ నిరసనలు: గాయపడిన కానిస్టేబుల్ మృతి

ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన ఆదివారంనాడు హింసాత్మకంగా మారింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌ను గాయపరిచినవారికి సంబంధించిన వీడియో క్లిప్ తమ వద్ద ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనను హత్యా కేసు కింద పరిగణిస్తారు.
ఆందోళనకారులపై ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. డిమాండ్లకు ఓ పరిమితి ఉంటుందని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మండిపడ్డారు. ఇండియా గేట్ వద్ద ఆదివారం ఆందోళనకారులపై పోలీసులు చేపట్టిన చర్యలను ఆయన సమర్థించారు. ప్రభుత్వం ఆందోళనకారుల డిమాండ్లను అంగీకరించడానికి సిద్ధంగా లేదని ఆయన స్పష్టమైన సంకేతాల ఇచ్చారు.
ఆందోళనకారుల వద్దకు వెళ్లి మాట్లాడాలని వచ్చిన డిమాండుపై షిండే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఆందోళనకారులను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన సమర్థించుకున్నారు. శాంతిభద్రతల నుంచి దాన్ని వేరు చేసి చూడలేమని, దాని గురించి తాను ఇది వరకే మాట్లాడానని, ఆందోళన ప్రారంభించినప్పటి నుంచి తాను తన నివాసంలో వారిని కలిశానని, తన ఆఫీసులో కలిశానని, వారి ప్రతినిధులతో కూడా సమావేశమయ్యానని వివరించారు.
ఆందోళనకారుల్లోకి గూండాలు, అసాంఘిక శక్తులు ప్రవేశించినట్లు, అందుకే పోలీసులు కఠినంగా వ్యవహరించినట్లు ఆయన తెలిపారు. ఆ శక్తులు రాళ్లు విసురుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే పనికి పూనుకున్నాయని, దాంతో పోలీసులు చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రపతి భవన్‌లోకి చొరబడుతామంటే సహించాలా అని ఆయన అడిగారు. ఇండియా గేట్ వద్ద జరిగిన హింసపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications