టిడిపిలో తెలంగాణ చిచ్చు: ఇష్టం లేకున్నా.. నన్నపనేని

తాజాగా ఆ పార్టీ శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి తన అసంతృప్తి గళం విప్పారు. తాను సమైక్యవాదిని అన్నారు. అయితే పార్టీ తెలంగాణకు అనుకూలమని చెప్పినా తాము మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడ వద్దని ఆదేశాలు ఉన్నాయన్నారు. తాను పదిహేనేళ్లుగా పార్టీ కోసం పని చేశానని, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చారని ఆమె చెప్పారు.
తన కంటే కరడు గట్టిన సమైక్యవాది ఎవరూ లేరన్నారు. తెలంగాణకు అనుకూలంగా వైఖరి తీసుకున్నా క్రమశిక్షణకు కట్టుబడి ఏమీ మాట్లాడలేక పోతున్నామన్నారు. కొందమందికి పార్టీలో ఏం చేసినా చెల్లుతుందని ధ్వజమెత్తారు. తాను గట్టిగా మాట్లాడే పరిస్థితిలో లేనన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండే వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని ఆమె సూచించారు.
తెలంగాణకు వ్యతిరేకంగా గళం విప్పిన నర్సారావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని తాను ప్రశంసిస్తున్నానని చెప్పారు. ఆయన ధైర్యంగా తన గళాన్ని వినిపించారన్నారు. కాగా తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని నర్సారావుపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి శనివారం అన్నారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సమైక్యవాదంపై మాట్లాడుతానని చెప్పారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను ఆయనకు తెలియజేస్తానన్నారు.












Click it and Unblock the Notifications