జగన్ ఆస్తుల కేసు: మరో ఇద్దరు మంత్రులకు గండం

జగన్ ఆస్తులకు సంబంధించిన వాన్‌పిక్ కేసులో మోపిదేవి జైలులో ఉన్నారు. జగన్ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ మరో ఇద్దరు మంత్రులతో ఈ నెలాఖరును మరో ఛార్జీషీట్ వేసే అవకాశాలు ఉన్నాయి. జగన్ కేసులో సిబిఐ ఇప్పటికే పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది. ఇప్పుడు దాఖలు చేసే ఛార్జీషీటులో మరో ఇద్దరు మంత్రుల పేర్లను ప్రస్తావించే అవకాశాలు ఉండటం గమనార్హం. జగన్ కేసులో మోపిదేవితో పాటు మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరును కూడా ప్రస్తావించారు.
ధర్మాన అరెస్టుపై అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. ఆయన ఎప్పుడైనా అరెస్టు కావొచ్చుననే వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో ఇద్దరు మంత్రుల పేర్లు ఉండే అవకాశాలు ఉండటంతో రాజకీయంగా దుమారం రేగే అవకాశాలు ఉన్నాయి. సండూరు పవర్, భారతి, పెన్నా, ఇండియా, దాల్మియా సిమెంట్స్, ఇందూ ప్రాజెక్టు తదితర అంశాలపై సిబిఐ జగన్ కేసులో దర్యాఫ్తును కొనసాగిస్తోంది.
ఓఎంసి తరహాలో ఛార్జీషీట్లు
జగన్ బెయిల్ పిటిషన్‌కు సంబంధించి జరిపిన విచారణలో అన్ని అంశాలను కలిపి ఒకే ఛార్జీషీటు దాఖలు చేయాలని గతంలో సుప్రీం కోర్టు సిబిఐకి సూచించింది. అయితే ఇందులో వెసులుబాటు కూడా ఉంది. ఏదైనా ఛార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాఫ్తు ఇంకా కొనసాగుతుందని పేర్కొనే పక్షంలో ఆ తర్వాత దర్యాఫ్తులో వెల్లడైన అంశాల ఆధారంగా మరో ఛార్జీషీటును దాఖలు చేసుకోవచ్చు. ఓఎంసి కేసులో మూడు ఛార్జీషీట్లు దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications