వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, కెసిఆర్: సెంటిమెంటే, కింది స్థాయిలో వీక్?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - YS Jagan
హైదరాబాద్: రాష్ట్రంలోని సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎన్నికల్లో తిరుగులేని సత్తా చాటుతారని ఇటీవలి సర్వేలు చెప్పాయి. ఈ ఇద్దరు నాయకులు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. సీమాంధ్రలో తనకు తిరుగులేదని భావిస్తున్న వైయస్ జగన్ తెలంగాణలో బలం పెంచుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నారు. సహకార ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీల బలహీనతలు బయటపడ్డాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సహకార ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉండడంతో కాంగ్రెసు నాయకులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెసు అక్రమంగా గెలిచిందనే ఆరోపణలు చేస్తున్నా, ఇటువంటి ఎన్నికల్లో అధికార పార్టీదే పైచేయి అవుతుందని చెబుతున్నా తమ బలహీనతలపై తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోలోన ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా ప్రధానంగా సెంటిమెంట్‌పైనే ఆధారపడి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటుతో వైయస్సార్ కాంగ్రెసు ముందుకు సాగుతుండగా, తెలంగాణ సెంటిమెంటుతో కెసిఆర్ నెట్టుకొస్తున్నారు.

అటు కెసిఆర్ గానీ, ఇటు వైయస్ జగన్ గానీ తమ తమ పార్టీలను కింది స్థాయిలో బలోపేతం చేయలేదు. సంస్థాగత నిర్మాణాలు కూడా బలహీనంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. సంస్థాగతంగా బలోపేతం చేయక ముందే వైయస్ జగన్ జైలు పాలయ్యారు. దీంతో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఆమె కూతురు షర్మిలలు ఆకర్షణతో ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని పటిష్టపరిచి, పునాది స్థాయిలో పార్టీని నిలబెట్టే ప్రయత్నాలు మాత్రం సాగడం లేదు.

ఇక, కెసిఆర్ విషయానికి వస్తే, మొదటి నుంచి కూడా ఆయన కింది స్థాయిలో పార్టీని నిర్మించే ప్రయత్నాలు తక్కువగా చేశారు. సంస్థాగతంగా ఆ పార్టీ బలహీనంగా ఉంది. కింది స్థాయిలో పార్టీకి ఎల్లవేళలా కాపు కాసే నాయకత్వం కొరవడింది. ఉద్యమాన్నే తన బలంగా మలుచుకోవడానికి తెరాస ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ సెంటిమెంటు మాత్రమే ఆ పార్టీని బతికిస్తూ వస్తోంది. పైగా, ఎప్పటికప్పుడు పార్టీ నుంచి కెసిఆర్‌ను వ్యతిరేకించి, బయటకు వెళ్లే నాయకులు కూడా ఉంటూ వస్తున్నారు. అలాంటి పరిణామాలను నివారించడానికి కెసిఆర్ ప్రయత్నాలు చేయడం లేదు.

కింది స్థాయిలో కూడా తెలంగాణవాదాన్నే తెరాస నమ్ముకుంది. తెలంగాణ జెఎసిలు చేసిన నిర్మాణాలు తెరాసకు ఉపయోగపడుతున్నాయి. అందువల్లనే కెసిఆర్ తెలంగాణకు సంబంధించి మరో శక్తి ముందుకు రాకుండా, లేదంటే తమ పార్టీని సవాల్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణ జెఎసిని తన నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఉద్యమం పేటెంట్ హక్కు తమకు తప్ప మరెవరికీ దక్కకూడదనే పద్ధతిలో వ్యూహప్రతివ్యూహాలతో మాత్రమే కెసిఆర్ పనిచేస్తున్నారు. అందుకే, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తెలంగాణ నగారా సమితి, సిపిఐ, బిజెపి కూడా కెసిఆర్ తీరుపై మండిపడుతూ వస్తున్నాయి. ఎన్నికల నాటికి తెలంగాణ ఉద్యమం తీవ్రతను పెంచి, మొత్తం సెంటిమెంటును తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రమే తన విజయం ఉందని కెసిఆర్ నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు.

English summary
According political experts - YS Jagan's YSR Congres and K chandrasekhar Rao's Telangana Rastra samithi (TRS) are weak at ground level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X