ఆరో అభ్యర్థిపై సోనియా వెనక్కి: ఆశావహులపై సిఎం ఫైర్

కాంగ్రెసు అభ్యర్థుల జాబితా శుక్రవారం రాత్రి గానీ శనివారం ఉదయం గానీ వెలువడే అవకాశాలున్నాయి. తొలుత కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఆజాద్‌తో గంటకు పైగా చర్చలు జరిపారు. వీరిద్దరు వేర్వేరు జాబితాలను ఇచ్చినట్లు సమాచారం. వీరికి ముందుగానే డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆజాద్‌ను కలిసి మరో జాబితాను సమర్పించినట్లు చెబుతున్నారు.
వారి జాబితాలను చూసిన అధిష్టానం పెద్దలు అప్పటికే తయారు చేసుకున్న తమ జాబితాను కూడా వారి వద్ద పెట్టినట్లు సమాచారం. దీంతో ఇటు కిరణ్ కుమార్ రెడ్డి, అటు బొత్స సత్యనారాయణ కంగు తిన్నారని చెబుతున్నారు. దాంతో అభ్యర్థుల తుది జాబితా రూపకల్పన బాధ్యతను వారు సోనియాకే వదిలేసినట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నేరెళ్ల శారద, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్లు రవి, షబ్బీర్ అలీ, కంతేటి సత్యనారాయణరాజు, ధీరావత్ భారతి, కె. వీరభద్ర స్వామి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదుగురు అభ్యర్థులను మాత్రమే పోటీకి దించాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరో అభ్యర్థిని రంగంలోకి దింపే విషయంపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. మరో పార్టీ అదనపు అభ్యర్థిని రంగంలోకి దింపకపోతే కాంగ్రెసు తరఫున ఐదుగురు, తెలుగుదేశం తరఫున ముగ్గురు, తెరాస తరఫున ఒకరు, వైయస్సార్ కాంగ్రెసు నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గత ఎన్నికల్లో మజ్లీస్ సహకారంతో కాంగ్రెసు ఆరో అభ్యర్థిని గెలిపించుకుంది. ఈసారి మజ్లీస్ దూరం కావడంతో ఆరో అభ్యర్థిని రంగంలోకి దింపకూడదని భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పలువురు కాంగ్రెసు నాయకులు కలిశారు. పార్లమెంటు సభ్యులు హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మంత్రి బలరాం నాయక్, తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. కొంత మంది మర్యాదపూర్వకంగా కలవగా, కొంత మంది ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమవారిని సిఫార్సు చేసుకోవడానికి కలిశారు.
కాగా, ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తున్నవారు సోనియా నివాసం వద్ద శుక్రవారం కూడా బారులు తీరారు. వారిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తమ పేరును సిఫార్సు చేయాలని కొంత మంది అడగడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇక్కడేం పనంటూ ఆయన అడిగారు. ఇక్కడ కూడా నన్ను వదిలిపెట్టరా అని ఆయన అన్నారు. సాయం చేస్తారనుకుంటే ముఖ్యమంత్రి చిరాకు పడుతున్నారని, మాట సాయం మాత్రమే అడిగామని, అభ్యర్థుల ఎంపికలో సిఎం చేసేది కూడా ఏమీ లేదని కొంత మంది ఆశావహులు అన్నారు.












Click it and Unblock the Notifications