సంజయ్‌దత్ కేసు పూర్వాపరాలు: తీర్పుపై ఖల్‌నాయక్

కేసు పూర్వాపరాల విషయానికి వస్తే...
1993 ముంబయి వరుస పేలుళ్ల ఉదంతానికి సంబంధించి అక్రమాయుధాలు కలిగి ఉన్న కేసులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్(53) నిందుతుడుగా ఉన్నారు. దీని నిమిత్తం పెద్ద సంఖ్యలో ఉన్న అప్పీళ్లు, క్రాస్ అప్పీళ్లపై సుప్రీం కోర్టు తీర్పు ఈ రోజు వెలువరించింది. ఇవి సంజయ్ సహా వంద మందికి సంబంధించినవి.
సంజయ్ సహా అందరూ 2006లో టాడా ప్రత్యేక కోర్టు నేరనిర్ధరణ చేసిన నిందితులు. 9ఎంఎం పిస్టల్, ఏకే-56 రైఫిల్ అక్రమంగా కలిగి ఉన్నారనే కేసులో టాడా కోర్టు సంజయ్‌ను దోషిగా తేల్చింది. ఆయనకు టాడా కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. కేసు విచారణ జరుగుతుండగా పదహారు నెలల పాటు సంజయ్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత అతను బెయిల్ పైన బయట ఉంటున్నారు.
సంజయ్‌కు టెర్రరిజంతో సంబంధం లేదు
సంజయ్ దత్ టెర్రరిస్ట్ కాదని నాడు టాడా కోర్టు అభిప్రాయపడింది. 1993 ముంబయి పేలుళ్ల సమయంలో ఆయన ఆత్మరక్షణ కోసమే ఆయుధాలు కలిగి ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ఆయుధాలు కలిగి ఉన్నందుకు అతనికి కోర్టు శిక్షను విధించింది. టెర్రరిస్టులకు ఆయనకు సంబంధం లేదని తెలిపింది.
భవిష్యత్తేంటి?
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సంజయ్ దత్ జైలుకు వెళతారా? ఏం చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయనకు నాలుగు వారాల సమయం ఉంది. జైలుకు వెళ్లి బయటకు రావడం లేదా రివ్యూ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. సంజయ్ తరఫు న్యాయవాది రివ్యూ పిటిషన్ వేయనున్నారని సమాచారం.
సంజయ్ చేతిలో రూ.వంద కోట్ల సినిమాలు
సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంజయ్ దత్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. సంజయ్ జైలుకు వెళ్తే బాలీవుడ్‌కు దాదాపు వంద కోట్ల రూపాయల నష్టం జరుగవచ్చునని అంచనాలు వేస్తున్నారు.
కాగా, కోర్టు తీర్పుపై సంజయ్ దత్ స్పందిస్తూ తాను తీర్పును గౌరవిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications