సోనియా ఆగ్రహించలేదే..!: ప్రశంసించారని టి-ఎంపీలు

సభలో తాము ఆందోళన చేసినప్పుడు సోనియా గాంధీ తమపై ఆగ్రహం వ్యక్తం చేసి వారించినట్లుగా వస్తున్న వార్తలు సరికావంటున్నారు. తెలంగాణ విషయంలో తమ ఆందోళనపై సోనియా మందలించలేదని, తమ ప్రయత్నాలు గుర్తించిన ఆమె అభినందించారని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వివేక్ చెప్పారు.
కాగా, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు మంగళవారం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ లోకసభలో ఆందోళన చేశారు. వారిని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వారించడంతో వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మంగళవారం పార్లమెంటు రెండో రోజు సమావేశాలు ఉదయం ప్రారంభమైనప్పుడు ఇది జరిగింది. పలుమార్లు ఉభయ సభలు వాయిదాపడ్డాయి. లోకసభలో నలుగురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
వివేక్, మంద జగన్నాథం, రాజయ్య, పొన్నం ప్రభాకర్‌లు తెలంగాణ బిల్లు పెట్టాలని నినాదాలు చేశారు. వారు తమ స్థానాలను వదిలి ముందుకు వచ్చారు. వారిని చూసిన సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో వారు వెనక్కి తగ్గారు. అయితే, సోనియా తమను మందలించలేదని ఎంపీలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications