షాకింగ్ న్యూస్: స్పాట్ ఫిక్సింగ్‌లో క్రిస్ గేల్ కూడా?
బెంగళూర్: ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి దిమ్మ తిరిగే విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివాదంలోకి క్రిస్ గేల్ పేరు కూడా వచ్చి చేరింది. ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్‌లో పాలు పంచుకున్న క్రిస్ గేల్‌కు బుకీల నుంచి విలువైన బహుమతులు అందినట్లు టీవీ చానెల్ వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి. మోతీ సన్స్ యజమానులు పవన్, సంజయ్ అనే బుకీల నుంచి గేల్‌కు 4.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభణం అందినట్లు టీవీ చానెల్ కథనాలు తెలియజేస్తున్నాయి.
టీవీ చానెల్ వార్తాకథనాల ప్రకారం - జైపూర్‌లోని ఓ షోరూంలో క్రిస్ గేల్ స్పాట్ ఫిక్సింగ్‌లో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ పేసర్ శ్రీశాంత్‌తో కలిసి కనిపించాడు. క్రిస్ గేల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. శ్రీశాంత్, క్రిస్ గేల్ కలిసి బంగారు ఆభరణాలు కొన్నారు. బిల్లు మాత్రం జిజూ జనార్దన్ అలియాస్ బిజూ చెల్లించాడు.

జిజూ జనార్దన్‌ను కూడా ఢిల్లీ పోలీసులు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు స్పాట్ ఫిక్సింగ్ కేసును ఛేదించినప్పటి నుంచి పవన్, సంజయ్ కనిపించడం లేదు. స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్న మరో నలుగురు క్రికెటర్ల పేర్లను శ్రీశాంత్ వెల్లడించాడని, వారిని పోలీసులు త్వరలోనే అరెస్టు చేస్తారని అంటున్నారు. ఈ నలుగురిలో క్రిస్ గేల్ కూడా ఉంటాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లను స్పాట్ ఫిక్సింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు ముగ్గురు కూడా పోలీసు కస్టడీలో ఉన్నారు. బెట్టింగ్ వ్యవహారంలో ముంబై పోలీసులు చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన గురునాథ్ మేయప్పన్‌ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications