పలకరింపులే: ప్రసంగాల్లేకుండా సాగుతున్న షర్మిల

ఆమె పాదయాత్ర బుధవారం ఉదయం పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ నుండి ప్రారంభమైంది. ఆమె దారిపొడవునా ప్రజలను పలుకరిస్తూ వెళ్లారు. పలుచోట్ల మహిళలు, రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అందరి కష్టాలు తీరుతాయని, జగన్ రైతులను రాజులా చూసుకుంటారని ఆమె చెప్పారు.
రైతుల గోడు విన్న షర్మిల పాలకుల తీరుపై మండిపడ్డారు. ‘‘ప్రజల్లోంచి వచ్చిన నాయకుడికైతే ప్రజల కష్టాలు తెలుస్తాయి. వైఎస్సార్ ప్రజల్లోంచి వచ్చారు కాబట్టి రైతుల కష్టం చూశారు.. రైతును రాజులా చూసుకున్నారు. ఈ పాలకులు ప్రజల్లోంచి వచ్చిన వారు కాదు. ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్‌లో వచ్చారు. వీళ్లకు రైతుల కష్టాలు తెలియవు. కొద్దిగా ఓపిక పట్టండి, జగనన్న వస్తారు.. రాజన్న రాజ్యం తెస్తారు. మళ్లీ రైతును రాజులాగా చూసుకుంటారు..'' అని భరోసా ఇచ్చారు.
బుధవారం 163వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని బ్రాడీపేట నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి జిన్నూరు, వేడంగి మీదుగా ఆచంట నియోజకవర్గంలోని కవిటం గ్రామంలోకి ప్రవేశించింది. ఈ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు షర్మిల చేరుకున్నారు. మొత్తం 11 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,153.8 కి.మీ. యాత్ర పూర్తయింది.












Click it and Unblock the Notifications