కిరణ్ దయాదాక్షిణ్యాలు వద్దు, రక్తం ఉడుకుతోంది: డిఎల్

ముఖ్యమంత్రి తన ఫ్లెక్సీలతో షో చేస్తున్నారని విమర్శించారు. కళంకిత మంత్రులపై వేటు వేసే ధైర్యం చేయలేకపోయారన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం తాను తన నియోజకవర్గంలో పర్యటిస్తానని, సమావేశాల్లో కిరణ్‌ను నిలదీస్తానన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు చూస్తుంటే రక్తం ఉడికిపోతోందన్నారు. తనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మంత్రి పదవి ఇచ్చారని, కిరణ్ దయాదాక్షిణ్యాలు అవసరం లేదన్నారు.
ఏ మచ్చా లేని తనను మంత్రి పదవి నుండి తొలగించడం బాధేసిందన్నారు. తన తొలగింపులో ముఖ్యమంత్రి సోదరుడు సంతోష్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. తన బర్తరఫ్ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. శాసనమండలి సభ్యుడు చెంగల్రాయుడికి ఏ విషయం పైన అవగాహన లేదన్నారు. కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించారని ఆరోపించారు.
తాను కాంగ్రెసును ఎట్టి పరిస్థితుల్లోను వీడనని చెప్పారు. కాగా ముఖ్యమంత్రి ఇటీవల డిఎల్ రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన విదేశాలలో ఉండగా ఇది జరిగింది. దీంతో అతను ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో ఉన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన డిఎల్‌ను పలువురు నేతలు కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications