సిటీలైట్ హోటల్: ఓనర్ పరిస్థితి విషమం, కొడుకు మృతి
హైదరాబాద్: రాజధానిలోని రాష్ట్రపతి రోడ్డులో ఉన్న సిటీ లైట్ హోటల్ ప్రమాదంలో హోటల్ యజమాని హసన్ బులోకి పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రమాదంలో యజమాని హసన్ తనయుడు ముస్తఫా బులోకి మృతి చెందాడు.

హోటల్ భవనం కుప్పకూలిన ప్రాంతాన్ని మంత్రి మహీధర్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదం దురదృష్టకరమన్నారు. ప్రమాదంపై దర్యాఫ్తునకు ఆదేశించినట్లు చెప్పారు. దర్యాఫ్తు నివేదిక అందిన వెంటనే బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామన్నారు. నోటీసులు ఇచ్చినా పట్టించుకోక పోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని మంత్రి దానం నాగేందర్ అన్నారు. పాత భవనాల యజమానులకు మళ్లీ నోటీసులు ఇస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామన్నారు.
భవనం కూలినప్రదేశాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆయన ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవనం కూలిన ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పిల్లర్ల సహాయంతో నిర్మించినది కాకపోవడంతో భవనం కుప్పకూలిందంటున్నారు. పోలీసులు, జిహెచ్ఎంసి, మెట్రోరైలు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications