కెసిఆర్‌పై మూకుమ్మడి దాడి: రెచ్చగొట్టొద్దని చిరంజీవి

సిఎం సీటు కోసం రెచ్చగొడ్తున్నారు: టిడిపి
సిఎం పదవిపై కాంక్షతోనే కెసిఆర్ ఇలాంటి దివాళాకోరు ప్రకటనలు చేస్తున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ నిలిచిపోతే దానికి కెసిఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తనకు తెలియకుండా తెలంగాణ వచ్చిందన్న బాధ కెసిఆర్‌లో కనిపిస్తోందని, అందుకే దానికి అడ్డంపడే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కెసిఆర్ జాగీరు కాదని, అసలు కెసిఆర్ కూడా సీమాంధ్రకు చెందిన వాడేనంటూ టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు దుయ్యబట్టారు.
సీమాంధ్రుల్ని అంటే ఊరుకోను: చిరంజీవి
కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని చిరంజీవి అన్నారు. కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో కూడా అభద్రత భావం కలిగించాయన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలో కోపోద్రిక్తులై నిరసన వ్యక్తం చేస్తున్నవారిని ఆ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఆ మాటలు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కెసిఆర్ తెలంగాణ రావాలనుకుంటున్నారా? అక్కర్లేదనుకుంటున్నారా? వస్తే రాజకీయంగా వేరే పని ఉండదని, రాజకీయ నిరుద్యోగి అవుతారని రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని, ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
ఇలాంటివి జరుగుతాయనే తాను హైదరాబాద్‌ను శాశ్వతంగా సంయుక్త రాజధానిగా మార్చాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులకు రక్షణగా, భరోసా ఇచ్చే దిశగా తాను రోడ్డుపైకి వచ్చి నిలబడతానని, ఇందులో వెనుకంజ వేయబోనని చిరంజీవి స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటివి పునరావృతం అయితే పరిస్థితులు మరోలా ఉంటాయని, నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ విషయం సమసిపోవడం చాలామందికి ఇష్టంలేదని, ముఖ్యంగా కెసిఆర్‌కు అసలు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందుకే జఠిలం చేస్తున్నారన్నారు.
విభజనకు అవరోధం: కిషన్ రెడ్డి
కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్ర ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందేనంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, అలా ఎవరు చేసినా అవి తెలంగాణ విభజనకు అవరోధంగా మారే అవకాశముంది. అలాంటి వ్యాఖ్యలతో సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే బాధతో, ఆగ్రహంతో వారు ఉద్యమిస్తున్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు సరికాదని నారాయణ విమర్శించారు.












Click it and Unblock the Notifications