విభజన ఖాయం: చిరు మనసంతా హైదరాబాద్ మీదే
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజాప్రతినిధుల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైంది. రాష్ట్ర విభజనను ఆపలేమనే నిర్ణయానికి వారు ఇప్పటికే వచ్చినట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానం పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించి, విభజనకు సీమాంధ్ర నాయకులను తమ పరిధిలో ఇరికించి, విభజనకు నిర్ణయం తీసుకుంది. కానీ, హైదరాబాద్ విషయాన్ని మాత్రం బేరసారాలకు అనుకూలంగా వదిలేసింది. దీంతో హైదరాబాద్ మీద పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొంత కాలానికి హైదరాబాద్ విషయాన్ని కూడా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ తేల్చేశారు. ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్ శాంతిభద్రతలను పదేళ్ల పాటు కేంద్రం చేతుల్లో పెట్టుకుంటుందని, ఈ పదేళ్లు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆయన చెప్పారు. అయినా, సీమాంధ్ర నాయకులు హైదరాబాద్‌పై పట్టు వీడడం లేదు. ముఖ్యంగా కేంద్ర మంత్రి చిరంజీవి మనసంతా హైదరాబాద్ మీదే కేంద్రీకృతమైంది.

హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే వ్యూహాన్ని సీమాంధ్ర నాయకులు అనుసరిస్తున్నారు. అందుకు హైదరాబాద్‌పై మూడు ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారు. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు శాశ్వతంగా ఉమ్మడి రాజధాని చేయాలని, లేదంటే కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, అది కూడా సాధ్యం కాకపోతే దేశానికి రెండో రాజధానిని చేయాలని వారు పట్టుబడుతున్నారు. మంగళవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత కూడా చిరంజీవి అదే మాట అన్నారు. ప్రస్తుతం ఏర్పాటయ్యే ఆంటోనీ కమిటీ ముందు సీమాంధ్ర నాయకులు ఇదే ప్రతిపాదనను పెట్టనున్నారు.
చిరంజీవి కుటుంబ సభ్యుల ప్రయోజనాలు, సినీ పరిశ్రమ ప్రయోజనాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. సీమాంధ్ర నాయకుల సంస్థలు కూడా హైదరాబాద్‌లో ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్‌పై వారు పట్టుబడుతున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినా, ఇక్కడే చదువుకున్నారు. కానీ ఆయనకు హైదరాబాద్‌కు సంబంధించిన ప్రయోజనాలు ఏమీ లేవని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రయోజనాలు కూడా హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. అందువల్లనే హైదరాబాద్‌ను తెలంగాణకు ఎలా ఇస్తారని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి వైయస్ విజయమ్మ అడుగుతున్నారు. అయితే, సీమాంధ్ర ప్రజల మనోభావాలు మరో రకంగా ఉన్నాయి. వారు హైదరాబాద్‌ను, తెలంగాణను వేరుగా చూడడం లేదు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాల భయం వారిని ఎక్కువగా పట్టుకున్నట్లుంది. రాష్ట్రం విడిపోతే తమ ఉద్యోగావకాశాలకు గండి పడుతుందనే ఆందోళన వారిని పీడిస్తోంది.
రాయలసీమ ప్రాంత నాయకులు, ప్రజల పరిస్థితి మరో విధంగా ఉంది. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారిది నీళ్లకు సంబంధించిన వ్యవహారం. కృష్ణా మిగులు జలాలపై ఆధారపడి రాయలసీమలో ప్రాజెక్టులను నిర్మించారు. వాటికి ఇప్పటికి వరకు ఏ విధమైన ఆటంకం లేకుండా శ్రీశైలం రిజర్యాయర్ నుంచి నీళ్లు అందుతున్నాయి. రాజోలిబండ నుంచి కూడా నీళ్లు తరలించుకుపోతున్నారు. రాష్ట్రం విడిపోతే, నికర జలాల్లో తమ వాటాను తెలంగాణ తరలించుకుంటే, అవి ఏమవుతాయనే ఆందోళన వారికి ఉంది. రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ ప్రధానంగా ఈ విషయాన్నే ముందుకు తెస్తున్నారు.
ఏమైనా, పార్టీ అధిష్టానం మనసు మాత్రం మారేట్లు లేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికే అది నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. అదే రకంగా హైదరాబాద్ విషయంలోనూ వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌ను తెలంగాణలో అంతర్భాగంగానే గుర్తిస్తోంది. సీమాంధ్ర వెసులుబాటు కోసం, సీమాంధ్ర ప్రజల భయాందోళనలను పోగొట్టడానికి పదేళ్ల పాటు శాంతిభద్రతలను కేంద్రం చేతుల్లో పెట్టడానికి నిర్ణయించుకుంది. ఈ విషయంలో తెలంగాణ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి బిజెపి మద్దతు కూడా అవసరం కాబట్టి, కాంగ్రెసు అధిష్టానం తన నిర్ణయం నుంచి పక్కకు తొలగడానికి సిద్ధంగా లేదని చెప్పాలి.












Click it and Unblock the Notifications