వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సందేహాలకు ఇదిగో జవాబు!: ధీటుగా కిరణ్‌కు కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం తన ప్రెస్‌మీట్‌లో పచ్చి అబద్దాలు చెప్పారని, రాష్ట్రాలు ఏర్పడ్డాక మాతో మీకు, మీతో మాకు అవసరాలు ఉండవా... సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించుకోలేమా అని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం మండిపడ్డారు. సీమాంధ్ర నేతలతో పాటు రాజీనామా చేసిన ముఖ్యమంత్రి ఇంకా ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి నిన్న పసలేని వ్యాఖ్యలు, అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదుపై ఆయనవి అసందర్భ వ్యాఖ్యలన్నారు. తెలంగాణ రాష్ట్రంపై ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లనే అలా చెప్పారని ఎద్దేవా చేశారు. మానవతా దృక్పథంతో పదేళ్లు హైదరాబాదు ఉమ్మడి రాజధానికి అంగీకరించామని, కొత్త రాజధాని ఏర్పడేదాకా ఇక్కడి నుండి కార్యకలాపాలు కొనసాగించవచ్చునని చెప్పారు.

ఇక్కడ పుట్టిన వారందరినీ తాము తెలంగాణవారిగానే గుర్తిస్తామన్నారు. కిరణ్ మాత్రం తనకు తానుగానే తాను మరో ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి అవసరమైతే ఇక్కడ కర్రీ పాయింటో, టిఫిన్ సెంటరో పెట్టుకోవచ్చునన్నారు. సిఎం అంతా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి తరహాలో ఆయన మాట్లాడటం లేదన్నారు. హైదరాబాదులో 15 వేల మంది న్యాయవాదులు ఉంటే యాభై వేల మంది అని కిరణ్ చెప్పడం విడ్డూరమన్నారు.

KCR and Kiran Kumar Reddy

ముఖ్యమంత్రి చరిత్రను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. న్యాయవాదుల అంశంపై తాను సిఎంతో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. 1919లోనే హైదరాబాదులో హైకోర్టు ఏర్పడిందన్నారు. గుంటూరులో 1954లో ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారమవుతుందని కిరణ్ పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో రైతులను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

తెలంగాణలో విద్యుత్ స్థాపక సామర్థ్యం 4825 మెగావాట్లు అని, కేంద్ర గ్రిడ్ నుండి 1260 మెగావాట్లు వస్తుందని, థర్మల్ పవర్ నుండి 2282 మెగావాట్లు స్థాపక సామర్థ్యం ఉందని, జల విద్యుత్ ద్వారా 2541 మెగావాట్లు అందుబాటులో ఉంటుందని చెప్పారు. తెలంగాణలో నికర విద్యుత్ వినియోగం 6800 మెగావాట్లుగా ఉందని, కేవలం 2458 మెగావాట్ల లోటు మాత్రమే ఉంటుందన్నారు.

జూరాల, సింగరేణి, భూపాలపల్లి తదితరాల ద్వారా విద్యుత్ కొరతను తీర్చుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఎవరికీ కేటాయించని పదిశాతం విద్యుత్ ఉంటుందన్నారు. అంతేకాకుండా చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుండి అదనంగా విద్యుత్ ఉందన్నారు. తాను గత రాత్రే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడానని, డబ్బులిచ్చి వెయ్యి నుండి పదిహేను వందల మెగావాట్ల విద్యుత్ వరకు కొనుక్కోవచ్చునని చెప్పారన్నారు. ప్రభుత్వం ప్రతిపాదిత, ప్రారంభమైన పలు ప్రాజెక్టులు ఉన్నాయన్నారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు రంగుల కల అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల చాలా నీరు వృథాగా పోతుందని, దానిని తాము ఉపయోగించుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఆంధ్రాలో విద్యుత్ మిగులు ఉందని, రాష్ట్రం ఏర్పడినాక మేం కొంటే ఆ విద్యుత్‌ను మీరు ఇవ్వారా అని ప్రశ్నించారు. కొన్నా ఇవ్వనంత కక్షపూరితంగా వ్యవహరిస్తారా అని విమర్శించారు. మాతో మీకు ఎప్పుడూ అవసరం రాదా అన్నారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వాలో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు అబద్దాలు చెప్పి భయపెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. హైదరాబాద్ తెలంగాణకే అని సిడబ్ల్యూసి చెప్పాక కిరణ్ మళ్లీ దాని గురించి మాట్లాడటమేమిటన్నారు. ఉద్యమాలు, కోరికలతో రాష్ట్రాలు ఏర్పడవన్న కిరణ్ అప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములును మర్చిపోయారా అని అడిగారు. ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో కిరణ్ చెప్పాలన్నారు.

2004లో తెరాసతో కాంగ్రెసు పొత్తు పెట్టుకున్నప్పుడు, కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పెట్టినప్పుడు, 2009లో ప్రకటన చేసినప్పుడు కిరణ్ ఏం చేశారన్నారు. విడిపోతే పలు సమస్యలు ఉన్నాయని చెబుతున్న కిరణ్ కలిసుంటే ఏం లాభమో చెప్పాలన్నారు. హైదరాబాదును రెండో రాజధాని చేయాలని నాడు అంబేడ్కర్ చెప్పారంటున్న వారు ముంబై గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలన్నారు. సంప్రదింపుల తర్వాతనే విభజన నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఆంధ్రా, తెలంగాణలు భారత దేశంలో భాగమే అన్నారు. విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామన్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయిందని, దానిని ఎవరూ ఆపలేరన్నారు. అనవసర రాద్ధాంతం చేయవద్దన్నారు. దేశాల మధ్యనే ఎన్నో సమస్యలు ఉండగా నీటి విభజన జరుగుతుండగా, ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య వచ్చిన సమస్య ఏమిటన్నారు. ఇరుప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నారు. వెయ్యేళ్లు బతకాలని ఎవరు రాలేదని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నారు.

610 జివోపై కిరణ్ కాకిలెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. సకల జనుల సమ్మె జరిగినప్పుడు తెలంగాణ ఉద్యోగులు హాజరుకాకపోయినా ఎక్కువ శాతం హాజరు ఉందని, దానిని బట్టే ఎంతమంది ఆంధ్రా ఉద్యోగులు ఉన్నారో అర్థమవుతోందన్నారు. ఉద్యోగుల విషయంలో అనవసర రాద్దాంతం వద్దన్నారు. ఆంధ్రా ఉద్యోగులను వెళ్లమని తామెందుకంటామన్నారు. ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడుంటే తమకే లాభమన్నారు. సమైక్య రాష్ట్రం ప్రయోగం విఫలమైందన్నారు. విడిపోయే వివాదాలు వద్దన్నారు.

వలస వచ్చిన వారు ఇది తమ నగరమే అని కబ్జా పెట్టడం విడ్డూరమన్నారు. హైదరాబాదు నుండి ఎవరు ఎవర్నీ పొమ్మనరన్నారు. ఉద్యోగులు, విద్యుత్ తదితర అంశాల పైన కిరణ్ కేంద్రాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయవద్దన్నారు. తాము సినీ పరిశ్రమను కూడా వెళ్లమనడం లేదన్నారు. ఆంటోనీ కమిటీ సీమాంధ్రుల సమస్యలు చెప్పుకోవడానికే తప్ప, తెలంగాణ, హైదరాబాద్ నిర్ణయం నుండి వెనక్కి తగ్గడానికి కాదన్నారు.

English summary
Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao has responded on CM Kiran Kumar Reddy's statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X