పూలు ఇస్తే పేడ కొట్టడమే సీమాంధ్ర సంస్కృతా?: ఈటెల
హైదరాబాద్: సీమాంధ్రులకు తాము పూలు ఇస్తుంటే, అక్కడి వారు మాత్రం తమ వారి పైన పెండ(పేడ) కొట్టారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకినాడలో ప్రజాప్రతినిధి సతీమణి దీక్ష చేస్తున్నప్పుడు ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లిన తెలంగాణ ప్రాంత వైద్యురాలిపై అక్కడి వారు పేడతో కొట్టారన్నారు.
విశాఖలో బిటెక్ విద్యార్థిని కొట్టి ఇంటికి పంపించారని, మరొకరిని రాజీనామా చేసి పంపించారని, బెంగళూరులో సైతం తెలంగాణ వచ్చిన ఆనందంలో ఉన్న విద్యార్థిని వెళ్లగొట్టారని చెప్పారు. తమకు సంస్కారం గురించి చెబుతున్న వారు ఈ దాడులు, తగులబెట్టే సంస్కృతి పైన ఏమి మాట్లాడుతారన్నారు. మహిళ అని చూడకుండా పెండ కొట్టారన్నారు. అరవయ్యేళ్లుగా సీమాంధ్రులు తెలంగాణకు వచ్చి గుంటూరు పల్లెల పేరుతో నల్ల రేగటి నేలల్లో నివాసం ఏర్పర్చుకుంటే తాము కడుపులో పెట్టుకొని చూసుకున్నామన్నారు.

కేవలం హైదరాబాదులోనే కాకుండా తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా సీమాంధ్రులను ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నామన్నారు. చదువులేని మాకు సంస్కారం లేకుంటే చదువున్న మీ సంస్కృతి మాటేమిటన్నారు. విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. జై తెలంగాణ ముసుగులో కూడా ఎవరేం చేస్తున్నారో తమకు తెలుసునన్నారు.
తెరాసను కాంగ్రెసులో విలీనం చేయాలని తమకు కొందరు అల్టిమేటం జారీ చేయడం విడ్డూరమన్నారు. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే సోయి తమకుందన్నారు. జై తెలంగాణ అన్ని ప్రతి ఒక్కరిని ప్రజలు అక్కున చేర్చుకున్నారని, జై తెలంగాణ అంటూ కొందరు సొంత అజెండాలతో తిరుగుతున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రాలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు విఠల్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ స్వామి గౌడ్ అన్నారు. తాము దంచుడు మొదలుపెడితే ఏమీ మిగలదన్నారు. సీమాంధ్రలో ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దన్నారు. తెలంగాణకు సక్రమంగా వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అక్రమంగా వచ్చిన వారు మాత్రం వెళ్లిపోవాల్సిందే అన్నారు. అలాంటి వారిని ఎలా పంపాలో తమకు తెలుసునన్నారు.












Click it and Unblock the Notifications