సమైక్యవాదం చచ్చిపోయింది, వారు లేఖలివ్వాలి: బైరెడ్డి

రాయల తెలంగాణ కోరలేదని వారి పిల్లలపై వారు ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యవాదం ఏనాడో చచ్చిపోయిందని, ప్రస్తుతం రాయలసీమ విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాలని అన్నారు. రాయలసీమ విచ్ఛిన్నం కాకుండా రాయసీమ ప్రాంత నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌవవాధ్యక్షురాలు విజయలక్ష్మి కేంద్రానికి లేఖలు ఇవ్వాలని బైరెడ్డి డిమాండ్ చేశారు.
గతంలో వారు ముగ్గురూ తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినందునే రాష్ట్ర విభజన జరిగిందని బైరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా సమైక్యనాటకాలు, బస్సుయాత్రలు, దొంగ ఏడుపులు ఆపి రాయలసీమ పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన రాయల జల పరిరక్షణ యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
శనివారం ఉదయం 11 గంటలకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర మల్యాల సమీపంలోని హంద్రీనీవా ప్రాజెక్టు వరకు సాగుతుందన్నారు. ఇటీవల విడుదల చేసిన జీవో నెంబరు 72కు వ్యతిరేకంగా ఈ యాత్ర చేపడుతున్నట్లు బైరెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications