పసుపురంగు సిల్క్ చీరలో రాజ్యసభలో మెరిసిన రేఖ
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపి రేఖ మంగళవారం రాజ్యసభకు హాజరయ్యారు. ఈ సమావేశాలలో ఆమె తొలిసారి సభకు హాజరయ్యారు. గత మే 7వ తేదిన బడ్జెట్ సమావేశాల తర్వాత రేఖ సమావేశాల కోసం రాజ్యసభకు హాజరు కావడం ఇది మొదటిసారి.
రేఖ పసుపు రంగు సిల్క్ చీర, బంగారు రంగులో ఉన్న హ్యాండు బ్యాగుతో సభకు వచ్చారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతున్న సమయంలో వచ్చారు. ఆమె పలువురు సభ్యులను పలకరించారు. 57 ఏళ్ల రేఖ ప్రముఖ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌తో పాటు గత ఏప్రిల్‌లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

కాగా, సచిన్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు(ఆగస్టు 5)న సభకు హాజరైన విషయం తెలిసిందే. నీలం రంగు చారలు ఉన్న చొక్కాను, నల్లటి ప్యాంట్‌ను ధరించి టెండూల్కర్ రాజ్యసభకు వచ్చారు. సభకు వచ్చిన ఆయన సీట్లో కూర్చోవడానికి ముందు కొంత మందితో కరచాలనం చేశారు. సచిన్ టెండూల్కర్ ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ పక్క సీట్లో కూర్చున్నాడు. జావేద్ అక్తర్‌తో ఆయన ముచ్చట్లు పెట్టారు.
ఈ దృశ్యాన్ని సందర్శకుల గ్యాలరీ నుంచి భార్య అంజలి చూశారు. చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టును రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అభినందించినప్పుడు టెండూల్కర్ బల్లపై చరుస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తీవ్ర గందరగోళం మధ్య సభ వాయిదా పడినప్పుడు కొంతమంది సభ్యులు ఆయన వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. టెండూల్కర్ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేశారు.












Click it and Unblock the Notifications