జగన్‌తో ఉండేందుకు విజయ, భారతిలకు నో పర్మిషన్
హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వద్ద సహాయంగా ఉండేందుకు తమకు అనుమతించాలని కోరుతూ ఆయన తల్లి వైయస్ విజయమ్మ, భార్య వైయస్ భారతి దాఖలు చేసుకున్న మెమోను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆస్పత్రిలో ఒక్కడే ఉన్నందున కుటుంబ సభ్యులమైన తమను జగన్‌తో ఉండేందుకు అనుమతించాలని కోరుతూ వారిద్దరు శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేసుకున్నారు.
వారి మెమోను తిరస్కరిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిర్ణయం కోసం విజయమ్మ, భారతి కోర్టులో చాలా సేపు నిరీక్షించారు. జగన్ వద్ద ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని భారతి వ్యక్తిగతంగా కూడా న్యాయమూర్తిని కోరారు. అలా కోరే అవకాశం ఉంటుంది. అయితే, ఆమె విజ్ఝప్తిపై నిర్ణయాన్ని న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కోర్టు నిర్ణయం వెలువడిన భారతి న్యాయమూర్తిని కలిసి వ్యక్తిగతంగా విజ్ఝప్తి చేశారు.

రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ వైయస్ జగన్ ఆదివారంనాడు హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆరోగ్యం క్షీణించడంతో జగన్‌ను గురువారం అర్థరాత్రి ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా ఆయన దీక్షను సాగిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది.
దీక్ష విరమించాలని వైయస్ విజయమ్మ వైయస్ జగన్‌ను కోరారు. దీక్ష విరమించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ఆయనకు విజ్ఝప్తి చేశారు. అయితే, ఆయన వారి మాట వినడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications