మీరే తీసుకుంటున్నారుగా: హరికృష్ణ ఇష్యూపై బాబు

ఈ మీడియా సమావేశంలో హరికృష్ణ విషయాన్ని ప్రస్తావించగా సమాధానాన్ని దాటవేశారు. హరికృష్ణపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే - చర్యలు, ప్రతిచర్యలూ మీరే తీసుకుంటున్నారుగా అని సమాధానం దాటవేశారు.
రాష్ట్ర విభజన విషయంలో ఏ కత్తితో పొడవాలో చూపించింది వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అని, రాజ్యాంగంలోని 3వ ప్రకరణ ప్రకారం రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రానిదే బాధ్యత అని చెప్పిందని, ఇప్పుడు రాష్ట్ర విభజనకు తమ పార్టీని నిందిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని ఎలా విభజించవచ్చునో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్రానికి చెప్పిందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన లేఖను ఆయన చదివి వినిపించారు. వాటాదారులందరితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని, ఇష్టానుసారం చేయడం తగదని ఆయన తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై అన్నారు. అందరికీ సమన్యాయం చేయాలని ఆయన అన్నారు.
అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉందని, ప్రధాని మన్మోహన్ సింగ్ కీలుబొమ్మగా మారారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబమని తప్ప సోనియా గాంధీకి ఏ విధమైన అర్హత లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పరిపాలన లేదని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని ఆయన ఆరోపించారు. దేశంలో రాజకీయ అనిశ్చితి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications