పిక్చర్స్: ఓ వైపు ఆందోళన, మరోవైపు అప్రమత్తం
హైదరాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గురువారంనాడు బోసిబోయిన ప్రభుత్వ కార్యాలయాలు శుక్రవారం తిరిగి పోటాపోటీ నినాదాలతో దద్ధరిల్లాయి. తెలంగాణ వ్యతిరేక, అనుకూల నినాదాలతో ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. సచివాలయం, రోడ్లు భవనాల శాఖ వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం చేసిన ప్రకటన మళ్లీ వేడి పుట్టించింది. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే పార్టీలకు, ప్రభుత్వాలకు ప్రజలు సెలవు ప్రకటిస్తారని ఆయన అన్నారు. పరోక్షంగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానానికి హెచ్చరికలు చేశారని భావిస్తున్నారు. దాంతో సీమాంధ్ర, తెలంగాణ వర్గాల మధ్య వేడి పుట్టింది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి పార్థసారథి సమర్థించారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి ఎకైక నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, కాంగ్రెసు అధిష్టానం నిర్ణయాన్ని మార్చడానికి సీమాంధ్ర నాయకులు, ఉద్యోగులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ, సీమాంధ్రలోనూ ఆందోళనలు చెలరేగుతుండగా, ఢిల్లీలో రాజకీయ వేడి చోటు చేసుకుంది.

తెలంగాణ బిల్లుకు డిమాండ్
రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.

మందకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాదులో ఉండనివ్వబోమని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఎప్పుడో నిష్క్రియాపరుడిని చేసిందని ఆయన అన్నారు.

కోదండరామ్ హెచ్చరిక..
తెలంగాణవాదులకు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ హెచ్చరిక చేశారు. సీమాంధ్ర నాయకులు మాటలు నమ్మవద్దని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు. ఆయన న్యూడెమొక్రసీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

సీమాంధ్రులకు ప్రశ్నలు..
గతంలో మద్రాసు కోసం పట్టుబట్టిన సీమాంధ్రులు ఇప్పుడు హైదరాబాదు కోసం పట్టుపడుతున్నారని తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో అన్నారు. ఈ మేరకు వారు పోస్టర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

సీమాంధ్ర ఉద్యోగుల ప్రదర్శన
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు నినాదాలు చేశారు.

సీమాంధ్ర ఉద్యోగులకు పార్థసారథి
సీమాంధ్ర ఉద్యోగులకు మంత్రి పార్థసారథి మద్దతుగా నిలిచారు. సెప్టెంబర్ 7వ తేదీ ఎపిఎన్జీవోలు తలపెట్టిన బహిరంగ సభనకు వెళ్తానని ప్రకటించారు. జగన్ దీక్ష భగ్నం నిబంధనల మేరకే జరిగిందని ఆయన చెప్పారు. ప్రజల అభిప్రాయాన్నే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారన అన్నారు.

తెలుగుజాతి మధ్య విద్వేషాలా..
దేవాదాయ శాఖ కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. తెలుగుజాతి మధ్య విభభీజాలు మొలకెత్తకుండా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కోరుతూ పోస్టర్స్‌ను ప్రదర్శించారు.

విభజనే ముద్దు..
దేవాదాయ శాఖలో సీమాంధ్ర ఉద్యోగులకు పోటీగా తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సమైక్యం వద్దు, తెలంగాణ ముద్దు అంటూ వారు నినదించారు.

ఎదురుపడి నినాదాలు..
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు దేవాదాయ శాఖ కార్యాలయంలో ఎదురు పడి పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. సమైక్య, తెలంగాణ నినాదాలతో కార్యాలయం దద్ధరిల్లింది.

విద్యుత్ సౌధలో అదే స్థితి
విద్యుత్ సౌధలో అదే ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటీ పడి ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. రోడ్లపై బైఠాయించారు.

మహిళా ఉద్యోగులు కూడా..
విద్యుత్ సౌధాలోని మహిళా ఉద్యోగులు కూడా ఆందోళనలో పెద్ద యెత్తున పాల్గొంటున్నారు. పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. దీంతో భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

రాజ్‌నాథ్‌తో నాగం భేటీ..
బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో బిజెపి రాష్ట్ర నేత నాగం జనార్దన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు త్వరగా ప్రతిపాదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నాగం రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.

ఢిల్లీలో కాంగ్రెసు టీ నేతలు..
తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో మకాం వేసి, తెలంగాణపై నిర్ణయం వెనక్కి వెళ్లకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, సీమాంధ్ర నాయకుల వాదనలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణవాళ్లకు అందుబాటులో...
ఢిల్లీలో కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులతో పాటు ఇతర తెలంగాణ నాయకులు మకాం వేసి, తమ వద్దకు వచ్చే తెలంగాణవాదులకు భరోసా ఇచ్చే పని చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications