జగన్ బెంగళూర్లో భవంతి కట్టలేదా: విజయమ్మపై పొన్నం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో దీక్ష చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మికి ఎవ్వరు ఎక్కడైనా నివసించొచ్చన్న సంగతి తెలియదా? ఆమె కొడుకు బెంగళూరులో 32 ఎకరాల్లో సువిశాలమైన బంగళా కట్టుకున్న సంగతి తెలియదా? అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గురువారం ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
వైయస్ విజయమ్మ దీక్షపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కర్రుకాల్చి వాత పెట్టినట్లు తెలంగాణ ప్రజల్ని తీవ్రమానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా రాక్షసులుగా, సీమాంద్రుల్ని దోచుకున్నట్లుగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలపైన, పార్లమెంటులో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు చేస్తున్న రభసపై తెలంగాణలోని టిడిపి నాయకులు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు కోరితే తాము తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిపిస్తామన్నారు.

సీమాంధ్ర ఉద్యమంలో 'త్రీ ఇడియట్స్' ఉన్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పీఆర్‌టీయూ శాంతి దీక్షలో త్రీ ఇడియట్స్ లగడపాటి, పరకాల ప్రభాకర్, తులసిరెడ్డి అని వివరించారు. తెలుగు వారంతా కలిసే ఉండాలని చెబుతున్న లగడపాటిని మీ ఇద్దరు భార్యలతో ఒకేచోట కలిసి సంసారం చేయగలరా అని ప్రశ్నిస్తే, జవాబు చెప్పకుండా తప్పించుకున్నారని చెప్పారు.
మరో ఇడియట్ పరకాల ప్రభాకర్ సమైక్యతపై తొలుత తన భార్య, బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్‌ను ఒప్పించాలని సూచించారు. తెలుగు వారంతా కలిసే ఉండాలని చెప్పే తులసిరెడ్డి, ఎందుకు కలిసుండాలో చెప్పాలని నిలదీశారు. ఎందుకు కలిసుండరాదో 1000 కారణాలు చెబుతామని, కలిసుండేందుకు ఒక్క కారణం చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications