జగన్ దీక్ష చేస్తున్నాడు, చికిత్స వద్దన్నాడు: విజయమ్మ
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోనూ తమ పార్టీ అధ్యక్షుడు, తన కుమారుడు వైయస్ జగన్ దీక్షను కొనసాగిస్తున్నాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చెప్పారు. జగన్‌ను విజయమ్మతో పాటు జగన్ భార్య భారతి, బావ అనిల్ కుమార్ ఆస్పత్రిలో పరామర్శించారు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర సమయంలో ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తూ విజయమ్మ మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి జగన్ నిరాకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఐదు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నీరసంగా ఉన్నారని, ఇప్పటికీ జగన్ ఏమీ తీసుకోవడం లేదని ఆమె చెప్పారు. మైరుగైన వైద్యం కోసం కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. నీరసంగా ఉన్నందున దీక్ష విరమించాలని తాము సూచించామని, అయనా జగన్ అందుకు అంగీకరించడం లేదని ఆమె చెప్పారు. జగన్‌ను చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన జగన్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఆమె ఖండించారు. ఉస్మానియాలో వైద్య సేవలు సంతృప్తికరంగా లేవని ఆమె అన్నారు.

తొలుత విజయమ్మ, భారతిలను ఆస్పత్రిలోకి అనుమతించలేదు. దాంతో అభిమానులు ఆగ్రహంతో ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. చివరకు ఒంటి గంట సమయంలో వైయస్ విజయమ్మను, భారతిని లోనికి అనుమతించారు. వారిద్దరు అరగంట పాటు జగన్‌తో మాట్లాడి వచ్చారు.
జగన్‌ను ఆస్పత్రికి తరలించే సమయంలో జైలు ప్రాంగణంలో అంబులెన్స్ వాహనం చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో జైలు సూపరింటిండెంట్ డ్రైవర్ దాస్, డిప్యూటీ సూపరింటిండెంట్ వద్ద పనిచేసే పైలట్ గోవిందరాజు గాయపడ్డారు. దీంతో జగన్‌ను ఆస్పత్రికి తరలించే విషయంలో కాస్తా జాప్యం జరిగింది. వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంవల్లనే ఈ సంఘటన జరిగినట్లు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications