దోషులుగా నిలబెడతా, వద్దంటే నమస్కారం పెడ్తా: బాబు
హైదరాబాద్: ప్రజల ముందు తాను తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను దోషులుగా నిలబెడతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. ఆయన ఆత్మగౌరవ యాత్ర కోసం ఉదయం గుంటూరుకు బయలుదేరారు. అంతకుముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆ మూడు పార్టీల రాజకీయ స్వార్థాన్ని తాను ప్రజలకు చెప్పి, వారి ముందు దోషులుగా నిలబెడతానన్నారు.
ఒక వ్యక్తి కోసం దేశం, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు. తాను హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశానన్నారు. తెలుగు వారు ఆత్మగౌరవం కోసమే తాను యాత్ర ప్రారంభిస్తున్నానన్నారు. టిడిపి హయాంలో హైదరాబాద్, రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, తాము అధికారం కోల్పోయాక అరాచకం ప్రారంభమైందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి రాజ్యమేలిందన్నారు.

సీమాంధ్రలో, తెలంగాణలో ఆత్మహత్యలకు ఎవరు కారకులని ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని, బొగ్గు కుంభకోణం ఫైళ్ల మాయం దారుణమన్నారు. చిన్న అధికారులకు ఉండే బాధ్యత ప్రధానికి లేకపోవడం దారుణమన్నారు. ఆర్థిక వ్యవస్థ పథనానికి కాంగ్రెస్సే కారణమన్నారు. వైయస్ బతికి ఉంటే సమస్యలు వచ్చేవి కావని చెప్పడం నీచమన్నారు.
ఇక్కడ తెరాసను విలీనం చేసుకోవడం, అక్కడ జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే కాంగ్రెసు ఆలోచన అన్నారు. ముప్పై మూడు రోజులుగా ప్రజలు రెడ్డెక్కినా స్పందించక పోవడమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెసు కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తెలుగు వాడి సత్తా చూపించాల్సిన అవసరం వచ్చిందన్నారు. తన యాత్రలో ఎలాంటి స్వార్థం లేదన్నారు. ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవడం చేతగాక ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు, ప్రజల బాధను అర్థం చేసుకోవాలన్నారు.
ప్రజలను పిలిపించి మాట్లాడాల్సిందన్నారు. జాతిని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెసు పార్టీ కంకణం కట్టుకుందని ఆరోపించారు. ప్రజలను తాను సమాయత్తం చేస్తానని తెలిపారు. కాంగ్రెసు కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోంటానని చెప్పారు. కాగా, బాబు ఆత్మగౌరవ యాత్ర గుంటూరు జిల్లా పొందుగుల నుండి ఈ రోజు పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది. ఐదు రోజులు ఆయన జిల్లాల్లో పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications