వైయస్ విగ్రహాల ధ్వంసం: నిందలేయొద్దని కొణతాల

వరంగల్ జిల్లా శాయంపేటలో శనివారం అర్ధరాత్రి వైయస్ విగ్రహాన్ని రాళ్లతో కొట్టడం వల్ల కుడిచేతి భాగం విరిగి కిందపడింది. గ్రామ పంచాయతీ కార్యాలయం గోడ దూకి వచ్చి విగ్రహాన్ని రాళ్లతో కొట్టినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలియజేశారు.
మెదక్ జిల్లా జోగిపేటలో ఎంపిడివో కార్యాలయం ముందున్న విగ్రహాన్ని విరగ్గొట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రేరేపితమైన దుండగులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపించింది.
కాగా, రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ముందుకు రావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ హైదరాబాదులో సూచించారు. బాబు ఆత్మగౌరవ యాత్రలో సమస్యకు పరిష్కారం చూపిస్తారని ప్రజలు ఎదురు చూస్తుంటే వైయస్‌ను విమర్శిస్తూ ఊకదంపుడు ఉపన్యాసం చేస్తున్నారన్నారు.
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు ఓట్ల రాజకీయాలు మాని రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలని సలహా ఇచ్చారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే వారికి బ్లాంక్ చెక్(విభజనకు అనుకూలంగా లేఖ) ఇచ్చిన బాబు ఏ ప్రాంతానికీ న్యాయం చేయలేరని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడం కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యంగా ఉంచవలసిన అవసరముందన్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవించినట్లే తమ పార్టీ సీమాంధ్ర సెంటిమెంటునూ గౌరవిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications