కాంగ్రెస్ అభ్యర్థులకు రాహుల్ గాంధీ 5 పేజీల టెస్ట్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో టిక్కెట్ కోరుకునే వారికి ఏఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీ పరీక్ష పెట్టబోతున్నారట. టిక్కెట్టు కోరుకునే వారిని పరీక్షించేందుకు ఆయన ఐదు పేజీల దరఖాస్తును తయారు చేసి ఉంచుకున్నారట. ఆయన రూపొందించిన ఐదు పేజిల దరఖాస్తును టిక్కెట్ కోరుకునే వారు పూర్తి చేయాలి.
తాను పోటీ చేయదలుచుకున్న నియోజకవర్గం, అక్కడ పార్టీ బలం ఎలా ఉంది, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమేరకు తెలుసు... తదితర అంశాలతో దరఖాస్తు ఉందట. తన పరీక్ష ద్వారా అభ్యర్థికి పార్టీ పైన, నియోజకవర్గం పైన ఎంత పట్టు ఉందో తెలిసిపోతుంది.

టిక్కెట్ల విషయంలో ఇక నుండి పైరవీలకు, మధ్యవర్తులకు తావీయకుండా అర్హులైన అభ్యర్థుల ఎంపికకు ఇది దోహదపడుతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారట. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఆశించే వారికి ఈ పరీక్ష పెట్టనున్నారట.
కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెసు పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆ తర్వాత లోకసభ సాధారణ ఎన్నికలు ఉన్నాయి. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications