డాక్టర్లు సిఫార్సు: అయినా జగన్‌కు నో హోం ఫుడ్
హైదరాబాద్: ఇంటి భోజనం రుచి చూసే అవకాశం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. ఆయనను నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) నుంచి చంచల్‌గుడా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న వైయస్ జగన్‌ను ఇంటి భోజనాన్ని అనుమతించడానికి జైలు అధికారులు సిద్ధంగా లేరంటూ ప్రచారం సాగుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం - జగన్ భార్య భారతి, తల్లి వైయస్ విజయమ్మ, ఆయన ఇద్దరు కూతుళ్లు, బావ అనిల్ కుమార్ మంగళవారంనాడు జగన్‌ను చూడడానికి జైలుకు వచ్చారు. వారు తమతో పాటు పుష్టికరమైన ఆహారం తీసుకుని వచ్చారు. నిమ్స్ వైద్యులు బుధవారం డిశ్చార్జీ చేసిన సమయంలో జగన్‌కు ఇంటి భోజనం ఇవ్వాలని సూచించడంతో వారు అలా వచ్చారు.

ఇంటి నుంచి తెచ్చిన ఆహార పదార్థాలను జైలు అధికారులు లోనికి అనుమతించలేదని తెలుస్తోంది. వైద్యులు సిఫార్సు చేసినప్పటికీ జైలులోకి వాటిని అనుమతించబోమని జైలు అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇంటి భోజనం ఇస్తే మంచిదని చెప్పారు గానీ అదే ఇవ్వాలని వైద్యులు చెప్పలేదని చంచల్‌గుడా జైలు సూపరింటిండెంట్ బి సైదయ్య తమతో అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్ని అనుమతించాలా, లేదా అనేది జైలు అధికారుల పరిధిలోనే ఉంటుందని ఆయన చెప్పినట్లు ఆ మీడియా సంస్థ కథనం తెలిపింది. తాము రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేమని, అందుకే ఇంటి భోజనాన్ని జైలులోకి అనుమతించడం లేదని చెప్పారని రాసింది.
ప్రత్యేక హోదా ఖైదీలు తమకు ఇష్టమైన, తమకు నచ్చిన వంటలు చేయించుకోవడానికి బరాక్‌లో అవకాశం ఉంటుంది. విఐపి బరాక్‌లో వండి వంటనే జగన్ ఇప్పటి వరకు తీసుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాకథనం తెలిపింది. జగన్ నిరుడు మే 28వ తేదీన అరెస్టయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications