3 రాజధానులకే మొగ్గు.. తగ్గేదేలే అంటోన్న బొత్స.. జగన్ ఆదేశాలే శిరోధార్యం..
మూడు రాజధానులపై ఏపీ సర్కార్ ముందుకు వెళుతుంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా ప్రభుత్వ తీరు మారడం లేదు. కోర్టు తీర్పుతో అయినా వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరవాలని విపక్ష టీడీపీ వాదిస్తోంటే.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని, ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని అధికార వైసీపీ చెబుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం తమ ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టంచేశారు.

3 రాజధానుకలే మొగ్గు..
తమ ప్రభుత్వం మూడు రాజదానులకే కట్టుబడి ఉందని బొత్స చెప్పారు. పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందేలా చూడటమే తమ ప్రభుత్వ ధ్వేయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా పాలనా వికేంద్రీకరణను ప్రస్తావించిందని మంత్రి చెప్పారు. ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీ.. శివరామకృష్ణన్ కమిటీ సిఫారులను ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత ఆలోచనలే తమకు శిరోధార్యం అని చెప్పిన మంత్రి.. టీడీపీ నేతలు చెప్పిన మాటలను తాము పెద్దగా పట్టించుకోబోమన్నారు.

కారణమిదేనా..?
పాలనా వికేంద్రీకరణ వైసీపీ ప్రభుత్వ విధానం అని తెలిపారు. టీడీపీ నేతల ఆలోచనలు లెక్కలోకి తీసుకోబోమని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏపీలో జిల్లాల పునర్విభజనపై వినతులను కమిటీ పరిశీలిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని ఏపీ హోం మంత్రి సుచరిత నిన్న తెలిపారు. తాము ఇప్పటికీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, రాజధానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని తెలిపారు.

హైకోర్టు తీర్పు.. కానీ
అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, సీఆర్‌డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని తెలియజేసింది. శాసనసభకు లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని, శాసన అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని కోర్టు తీర్పులో వెల్లడించింది. కానీ జగన్ సర్కార్ మాత్రం 3 రాజధానులపై ముందుకువెళుతుంది.












Click it and Unblock the Notifications